(ధ్యాన్)
ఏదైనా పని చేయాలంటే కాస్త నిలిచి నిదానంగా ఉండాలి. తినేటప్పుడైనా, తాగేటప్పుడైనా ఆ మాత్రం ప్రశాంతంగా ఉండమనే పెద్దలు చెబుతారు. కానీ ఇప్పుడు నానికి మాత్రం అంత ప్రశాంతత ఉన్నట్టు కనిపించడం లేదు. ఏం ఏమైంది పాపం… అని అనుకుంటున్నారా? అందరిదీ ఇప్పుడు అదే అనుమానమే. ఎందుకంటే… మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. బాధ్యతాయుతమైన వైద్యుడై ఉండి కూడా రా లాగించేశాడు నాని.
ఒకటి, కాదూ.. అరా కాదూ.. ఏకంగా రెండు పెగ్గులు వితౌడ్ వాటర్ ఆర్.. సోడా లాగించేశాడన్నమాట. నాగార్జున ఏదో ఒక పెగ్గు తాగుదామని కూర్చున్నాడనుకుంటే.. ఏమీ తెలియనట్టు అమాయకమైన ఫేస్‌తో వచ్చి పక్కనే కూర్చున్నాడు నాని. కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఉండక.. స్లోగా గ్లాస్ తీసి పక్కనపెట్టాడు. సరేనని పెగ్గు పోయడం నాగార్జున వంతయింది. `సోడానా? వాటరా? ` అని నాగార్జున అడిగేలోపు గుటుక్కుమని నాని ఆ రెండు పెగ్గులు ఎత్తేశాడు… ఇదంతా `దేవదాస్` టీజర్‌లో అన్నమాట.
ఈ టీజర్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం విడుదలైంది. నాగార్జునకు మాత్రమే ఇందులో డైలాగులు ఉన్నాయి. నానికి లేకపోవడం గమనార్హం. రీరికార్డింగ్ కూడా పాత సినిమాలను తలపించేలా ఉంది. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. నాగార్జున పక్కన ఆకాంక్ష సింగ్, నాని పక్కన రష్మిక ఇందులో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కానుంది.