లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమలు అల్ల కల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీల్లో రకరకాల సమస్యలు మొదలయ్యాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉన్నవేవీ విడుదలకు నోచుకోవడం లేదు. ఇక లాక్ డౌన్ ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీని పరిస్థితి. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారు? అన్న దానిపైనా క్లారిటీ లేదు. మాల్స్ థియేటర్స్ ఓపెన్ చేయడానికి ఆరు నెలలు పడుతుందా? ఏడాది పడుతుందా? అన్న దానిపై ఇంకా ప్రభుత్వాల నుంచి స్పష్టత లేకపోవడంతో నిర్మాతలంతా ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య నిర్మించిన `పోన్ మగాల్ వందల్` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
దీనిలో భాగంగా ఓ పెద్ధ సంస్థకు డిజిటల్ హక్కులు కట్టబెట్టాడు. తద్వారా సూర్య నిర్మాతగా లాభపడ్డాడు. దీంతో ఇతర చిన్న నిర్మాతలు ఈ ఐడియా ఏదో బాగుంది అంటూ ఓటీటీలతో బేరసారాలు చేస్తున్నారు. మంచి ధర వస్తే అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు. అయితే ఇదే విధానం థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కొనసాగితే థియేటర్ యాజమాన్యాలు, పంపిణీ వర్గం, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు వేరే వ్యాపారాలు చూసుకోవాల్సిందేనా అంటే అవుననే అంతా భావిస్తున్నారు. మొత్తంగా థియేటర్ వ్యవస్తే దెబ్బ తింటుంది. దీంతో ఈ పరిస్థితిని ముందే ఊహించిన థియేటర్ యాజమాన్యం సూర్య పై ఇంతకుముందు చిర్రుబుర్రులాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై వేటు వేస్తూ ఎగ్జిబిటర్స్ సంఘం నిర్ణయం తీసుకుంది.
ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను థియేటర్లో రిలీజ్ చేయకుండా అతనికి రెడ్ కార్డు వేసినట్లు థియేటర్ యాజమాన్య సంఘం ప్రకటించింది. అలాగే కేరళ థియేటర్ల సంఘం కూడా తమిళనాడు థియేటర్ల సంఘానికి మద్దతు తెలిపింది. తాము కూడా సూర్య సినిమాలను థియేటర్లో విడుదల చేయబోమని తీర్మానించింది. దీంతో సూర్యకు బిగ్ షాక్ తగిలింది. అయితే ఇక్కడ ఓ స్పష్టత రావాల్సి ఉంది. సూర్య నిర్మించిన సినిమాలనే రిలీజ్ చేయారా? లేక ఆయన హీరోగా నటించిన సినిమాలను కూడా రిలీజ్ చేయారా? అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. ఆ రెండు గనుక జరిగితే సూర్యకు డబుల్ ఝలక్ తగిలినట్టే. ఆయన సహా అతని నిర్మాతలు, దర్శకులు కూడా ఇబ్బంది పడాల్సిందే. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. సూర్యపై తమిళవాసులు ఎప్పుడూ గుర్రుగానే ఉంటారు. తమిళ ప్రజలు కన్నా..తెలుగు ప్రజలే తనకు ఎక్కువ అని పలు ఇంటర్వూల్లో సూర్య వెల్లడించింది ఇందుకేనేమో! విశాల్, కార్తీ పై కూడా తంబీలు ఎందుకనో వ్యతిరేకంగానే ఉంటారు.