సాధారణంగా రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ హీరోకి వేరే పనులేవీ ఉడకూడదు. పూర్తి సమయాన్ని సినిమా కోసమే కేటాయించాలి. షూటింగ్ ఉన్నప్పుడు పాల్గొనడం షూట్ లేనప్పుడు ఇంటికే పరిమితం కావడం. సినిమా ముగిసేవరకు హీరోను బయటకు వెళ్లనివ్వరు జక్కన్న. అలా వెళితే తన సినిమా అవుట్ ఫుట్ మీద ప్రభావం పడుతుందనేది ఆయన ఆలోచన. కాబట్టే రాజమౌళి చేతుల్లో చిక్కితే కొన్ని నెలలు బయటి ప్రపంచానికి దూరం కావాల్సిందే అంటుంటారు హీరోలు. అలాంటిది వేరే సినిమాల్లో నటించడం అనేది అసాధ్యం.
ఇంతవరకు ఏ హీరోకూ అలాంటి వెసులుబాటు కల్పించలేదు ఆయన. కానీ రామ్ చరణ్ కు ఆ ఛాన్స్ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ జరుగుతుండగానే ‘ఆచార్య’ స్టార్ట్ చేశారు చిరు. అందులో చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలి. కానీ అవతల రాజమౌళి. కుదురుతుందా లేదా, రాజమౌళి చరణ్ ను బయటికి వదులుతారో లేదో అనుకున్నారు. అప్పుడు చిరు రంగంలోకి దిగి రాజమౌళిని ఒప్పించారు. ‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ‘ఆచార్య’లో చరణ్ షెడ్యూల్ వేసుకున్నారు. ఏకధాటిగా షూటింగ్ చేసి ‘ఆచార్య’లో తన పార్ట్ ముగించుకున్నారు. అయితే రెస్ట్ తీసుకునే గ్యాప్ ఇవ్వలేదట రాజమౌళి. వీలైనంత త్వరగా ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో జాయిన్ కమ్మని చెప్పేశారట. ఇంకేముంది చరణ్ రెండు మూడు రోజుల విశ్రాంతితో సరిపెట్టుకుని ఛలో ‘ఆర్ఆర్ఆర్’ అంటున్నారు.