ఆ దారుణ కామెంట్స్ కు సమంత హర్ట్ అయ్యిందా?

త్రివిక్రమ్, సమంత, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన అ…ఆ చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ లో ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రహ్మణ్యం పాత్ర ఉంది. ఆయన చాలా గొప్ప సినిమాటోగ్రాఫర్‌ గా పేరుంది. సమంతతో మంచి అనుబంధం ఉంది. అయితే ఆయన తాజాగా సమంత నటించిన చిత్రంపై దారుణమైన కామెంట్ చేసారు. అది వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే…సమంత నటించిన ‘సూపర్‌ డీలక్స్’ చిత్రంపై ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రహ్మణ్యం కామెంట్‌ చేశారు. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి హిజ్రా పాత్రలో, రమ్యకృష్ణ వేశ్య పాత్రల్లో నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.

అయితే ఈ సినిమా గురించి నటరాజన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్‌ డీలక్స్’.. ఇది సినిమానా.. ఓ గాడ్‌.. అసలు భరించలేకపోయా’ అని పేర్కొన్నారు.

దాంతో ఆయన ట్వీట్‌ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానులు మాత్రం నటరాజన్‌ వ్యాఖ్యల పట్ల ఆయన్ను తప్పుబడుతున్నారు. సినిమా నచ్చకపోయినంత మాత్రాన ఇలా నీచంగా కామెంట్‌ చేయకూడదంటూ బుద్ధిచెబుతున్నారు. ఈ విషయంపై సమంత స్పందించలేదు. శృంగారం, లింగ వివక్షత వంటి అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.