జ్వ‌రంతో చేరితే గ్యాస్ట్రిక్ అంటారా? సునీల్‌లో కంగారు!!

సినీమీడియా అడ్డ‌గోలు ప్ర‌చారంపై స్టార్లు సీరియ‌స్ అయిన సంద‌ర్భాలున్నాయి. ఇంకా ఐసీయూలో ఉండ‌గానే పోయాడ‌ని రాసిన వార్త‌ల‌పై చాలా సంద‌ర్భాల్లో ఎంద‌రో ప్ర‌ముఖులు ల‌బోదిబోమ‌న్నారు. ఎవ‌రో రాసార‌ని ఇంకెవ‌రో అది కాపీ చేసి రాసేస్తూ అది అలా జ‌నాల్లో వైర‌ల్ అయిపోవ‌డం ఇంటికి ఫోన్లు రావ‌డం క‌ల‌త‌కు గురి చేసిన సంద‌ర్భాలున్నాయి.

అయితే అంత సీరియ‌స్ కాదు కానీ.. నేడు క‌మెడియ‌న్ సునీల్ పైనా ఆ త‌ర‌హా వార్త ఒక‌టి ప్ర‌చార‌మైంది. సునీల్ తీవ్ర‌మైన గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని చికిత్స పొందేందుకు గ‌చ్చిబౌళి గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ విభాగంలో చేరాడ‌ని ప్ర‌చార‌మైంది. అయితే తాజాగా దీనిపై సునీల్ వివ‌ర‌ణ ఇచ్చాడు. త‌న‌కు సైన‌స్ ఉంద‌ని.. దీనివ‌ల్ల గ‌త కొంత‌కాలంగా తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపారు. డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరిన‌ట్టు వెల్ల‌డించారు. సైన‌స్ కి విప‌రీతంగా మందులు వాడ‌డం కూడా త‌న స‌మ‌స్య‌కు కార‌ణ‌మైంద‌ని తెలిపారు. అనారోగ్యం.. ప్ర‌మాదాలు.. మ‌ర‌ణాల వంటి మ్యాట‌ర్స్ లో ఫోన్లు చేసి నిర్ధారించుకుని వార్త‌ల్ని ప్ర‌చురించ‌డం స‌రైన విధానం అని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.