సందీప్ కిషన్ క్షమాపణ చెప్పినా, జనం తిడుతున్నారు

సందీప్ కిషన్ క్షమాపణ చెప్పినా, జనం తిడుతున్నారు

సమాజంలో భాధ్యత గల విభాగాలు అయిన మీడియా, పోలీస్ తో గేమ్స్ ఆడకూడదు. ఎందుకంటే అలా ఆడితే తర్వాత నాన్నా..పులి కథలా పరిస్దితులు మారిపోతాయి. ప్రియదర్శి,పోలీస్ ల వ్యవహారం అలాగే అయ్యింది. ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో పెద్దఎత్తున హడావుడి జరిగిన సంగతి తెలిసిందే.

బైక్‌ ఇంటి ముందు పార్క్ చేసి ఉండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ప్రియదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

అయితే ప్రియ‌ద‌ర్శి త‌న ట్విట్ట‌ర్‌లో ఎవ‌రో అన్‌ఫ్రొఫెష‌న‌ల్ దొంగ అంటూ ఓ వీడియో చేసి పెద్ద హంగామానే చేశాడు. మరోవైపు ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ కొందరు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేయగా మరింత సీరియస్‌గా మారింది.

అయితే పోలీసులు రంగంలోకి దిగి లొకేషన్ ఎక్కడో చెప్పాలని ట్విట్టర్‌లో కోరారు. దీంతో కంగుతిన్న ప్రియదర్శి ఏం చేయాలో దిక్కుతోచక ఈ వ్యవహారం సీరియస్‌ అయితే ఎందాకా వెళ్తుందో ఏమోనని వెంటనే తాను పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించేశాడు. ఇందుకు వెంటనే ‘నిను వీడని నీడను నేనే’ హీరో సందీప్ కిషన్ సీన్ లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పోలీసులకు సందీప్ క్షమాపణలు చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారం సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేశారట. దీంతో అటు పోలీసులు, ఇటు నెటిజన్లు, సినీ ప్రియులు ప్రియదర్శి-సందీప్‌ల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.