(ధ్యాన్)
‘అతడు’ సినిమాలో కోట శ్రీనివాసరావు చేత త్రివిక్రమ్ ఓ డైలాగ్ చెప్పించారు. ‘అవును అన్నయ్య… హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది’ అని! హైదరాబాద్ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు చాలా అంటే చాలా అభివృద్ధి చెందాయి. యువతలో ఎక్కువ శాతం మంది హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తున్నారు. ఎవరైనా కాపీ కొడితే ఇట్టే చెప్పేస్తున్నారు. దాంతో ఏదో ఒక హాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు సినిమా తీసే హీరో, దర్శక నిర్మాతలను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ బాపతులో నెటిజన్ల చేతికి చిక్కిన తాజా హీరో సుమంత్! ఆయన హీరోగా నటించిన ‘ఇదం జగత్’ టీజర్ ఇటీవల విడుదలైంది. మీడియా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో డైలాగ్‌కి ఓ వర్గం ప్రేక్షకుల మంచి స్పందనే లభిస్తోంది. అయితే… కొంతమంది ప్రేక్షకులు కొన్ని గంటల్లోనే సుమంత్‌ని ఆడుకోవడం మొదలుపెట్టారు. పలు అవార్డులు అందుకున్న అమెరికన్ ఫిల్మ్ ‘నైట్ క్రాలర్’కి ఈ సినిమా కాపీ అని తేల్చెశారు. టీజర్‌లోని కొన్ని దృశ్యాలు కూడా హాలీవుడ్ స్ఫూర్తితో తీసినవే. అందులోనూ ‘బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లే’కి గాను ‘నైట్ క్రాలర్’ దర్శకుడికి నామినేషన్ దక్కింది. పాపులర్ సినిమా కావడంతో ప్రేక్షకులు సులువుగా పట్టేశారు. సుమంత్ అండ్ టీమ్‌ని దోషిగా నిలబెట్టారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తిగా సినిమాలు తీయడం తప్పు కాదు. కానీ, ఆ విషయం ముందు చెబితే పరువు దక్కేది.