మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆహార్యం అంటే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు రావాల్సిందే. ఆయన గెటప్ .. దూకుడైన ఆహార్యం .. డైలాగ్ ప్రతిదీ ఒక వీరుడినే తలపిస్తుంది ఆ సినిమాలో. తెల్లవాడికి ఎదురెళ్లిన విప్లవ వీరుడిగా అల్లూరిలోని పవర్ ని సూపర్ స్టార్ తనకు అన్వయించుకుని నటించిన తీరు అసమానం.
ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా అల్లూరి సీతారామరాజు. గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్ ఇది. సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు.
అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు.
చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది.
సినిమాను ప్రధానంగా హార్సిలీ హిల్స్ ప్రాంతంలో తెరకెక్కించారు. సినిమా స్కోప్ లో నిర్మాణమైన చిత్రంగా అల్లూరి సీతారామరాజు పేరొందింది. కృష్ణ 100వ సినిమాగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ఘన విజయాన్ని సాధించి 19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి పొందింది. సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాను సినీ విమర్శకులు కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా పేర్కొంటూంటారు.
ఇక ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ పవర్ ఫుల్ డైలాగుల గురించి చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన అల్లూరిగా జీవించారు. పతాక సన్నివేశాల్లో సుదీర్ఘ మైన ఎమోషనల్ డైలాగ్ తో సంచలనం సృష్టించారు. అయితే అలాంటి సన్నివేశాన్ని ఎంపిక చేసుకుని ఆయన అల్లుడే అయిన సుధీర్ బాబు ఎంత సాహసం చేశారో ఇదిగో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
డైలాగ్ చెప్పడమే కాదు… ఆ డైలాగ్ వీడియోని నేరుగా సూపర్ స్టార్ కృష్ణకు .. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆదిశేషగిరిరావుకి చూపించాడు సుధీర్. మామగారైన కృష్ణ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఇది. ఈ వీడియోలో కృష్ణ వారసులు ఉన్నారు. ఇంతకీ కృష్ణ ఏమని స్పందించారు? అంటే మీరే చూడండి. అన్నట్టు అల్లూరి డైలాగ్ చెప్పడంలో సుధీర్ బాబు వందశాతం సక్సెసయ్యాడా లేదా? అన్నది తెలుగు రాజ్యం రీడర్స్ చెప్పాల్సిందే.