టాలీవుడ్ లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య డబ్బింగ్ సినిమాల విస్పోటనం. ఇరుగు పొరుగు భాషల నుంచి వచ్చే సినిమాల వల్ల తెలుగు స్ట్రెయిట్ సినిమాలు నలిగిపోతున్నాయన్నది ఓ ఆరోపణ. అయినా కానీ అనువాదాలకు యథేచ్ఛగా అవకాశం కల్పిస్తోంది నిర్మాతల మండలి. ఫిలింఛాంబర్ వర్గాల్లోనూ ఎలాంటి కట్టడి లేదు. అయితే కొందరు అగ్ర నిర్మాతలే డబ్బింగుల్ని ఎంకరేజ్ చేస్తుంటే చిన్న నిర్మాతలు ఏమీ చేయలేని దుస్థితి ఉంది. ఆందోళన చెందడం తప్ప దీనికి కట్టడి లేదు.. పరిష్కారం లేదు. పైగా పండగల వేళ థియేటర్ల సమస్య ఉన్నా డబ్బింగులకే పట్టంగడుతుండడం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం! అన్నట్టుగానే సాగుతుంది.
ఇకపోతే… సూపర్ స్టార్ రజనీకాంత్ .. విశ్వనటుడు కమల్ హాసన్ సహా పలువురు తమిళ హీరోల్ని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. తమిళ సీనియర్ సత్యరాజ్ వంటి వారిని మనవాళ్లు ఏనాడో నెత్తిన పెట్టుకున్నారు. పొరుగు వాళ్లలో ప్రతిభను చూసారే కానీ.. తెలుగు సినిమాల మార్కెట్ ని ఎవరూ పట్టించుకోలేదు.
ఆ క్రమంలోనే రజనీ-కమల్ తర్వాత జనరేషన్ లో అజిత్- సూర్య- కార్తీ- విజయ్ – విక్రమ్ వంటి స్టార్లు ఇక్కడ తమ సనిమాల్ని యథేచ్ఛగా రిలీజ్ చేసుకున్నారు. వీళ్ల సినిమాల్ని తెలుగు జనం విశేషంగానే ఆదరించారు. ఇటీవల ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి కానీ ఇంతకుముందు బాగానే చూశారు. అందుకే అదే నమ్మకంతో ఇప్పటికీ తంబీలు తెలుగు మార్కెట్ పై పెద్ద రేంజులోనే కన్నేశారు.
కానీ ఇదే సన్నివేశం మన హీరోల సినిమాలకు ఉంటుందా? అంటే సందేహమే. ఇట్నుంచి ఏదైనా సినిమా వెళితే తమిళంలో కానీ మలయాళంలో కానీ ఆడే పరిస్థితి లేదు. కన్నడలో అయితే పొరుగు సినిమాల రిలీజ్ లకు అనుమతుల్లేవ్. ఏవో కొన్ని పాన్ ఇండియా రిలీజ్ లకు తప్ప అనుమతించారు. ఇరుగుపొరుగు పరిశ్రమల్లో కట్టడి ఉంది. అక్కడ నిర్మాతలంతా ఒకే తాటిపైకి వస్తారు. ఆపే ప్రయత్నం చేస్తారు. ఆడియెన్ లో కూడా ఇరుగు పొరుగు హీరోలపై ఏమంత ఆసక్తి ఉండదు. రేర్ గా మాత్రమే మన హీరోలు కనెక్టవుతుంటారు. అందుకే మన పరిశ్రమ కూడా మారాల్సిన అవసరం ఉందన్న వాదనా తెరపైకి వస్తూనే ఉంది. మరి మునుముందు అయినా మార్పు ఉంటుందేమో చూడాలి.