టాలీవుడ్ నిర్మాతల మండలిలో డివైడ్ ఫ్యాక్టర్ గురించి తెలిసిందే. ఏ సినిమాలు తీయకుండా సంక్షేమ ఫలాలు అనుభవించే వారిపై నిరంతరం సినిమాలు తీస్తూ యాక్టివ్ గా ఉండే నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు.. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేస్తూ నిర్ణయాత్మక విషయాల్లో మోకాలడ్డేవాళ్లు మండలిలో అధికమయ్యారన్న ఆరోపణ ఉంది. అందుకే వీళ్లందరినీ పక్కన పెట్టేసి యాక్టివ్ నిర్మాతల గిల్డ్ ని ప్రారంభించారు దిల్ రాజు ఆధ్వర్యంలో. ఇందులో కేవలం సినిమాలు తీసే 20 నుంచి 50 మంది నిర్మాతలు మాత్రమే ఉన్నారు. వీళ్లే పరిశ్రమను అన్నివిధాలా శాసిస్తుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్లదే హవా.
ఇప్పుడు అదే బాటలో దర్శకసంఘంలోనూ డివైడ్ ఫ్యాక్టర్ నడుస్తోందని తెలుస్తోంది. ఎన్.శంకర్ సారథ్యంలోని దర్శకసంఘానికి విలువను తగ్గించి .. యాక్టివ్ డైరెక్టర్స్ కొందరు ప్రత్యేకించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండడం తాజాగా బయటపడింది. మీటింగులన్నీ రహస్యంగా సాగిపోతున్నాయట. దీంతో దర్శకుల్లోనూ డివైడ్ నడుస్తోందని అర్థమవుతోంది. అయితే యాక్టివ్ డైరెక్టర్స్ గిల్డ్ లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ సహా పలువురు టాప్ డైరెక్టర్స్ ప్యానెల్ గా ఉంటారు. అలాగే పరిశ్రమలో వరుసగా సినిమాలు తీసే దర్శకులకు మాత్రమే ఇందులో స్థానం ఉంటుంది. కొందరు సీనియర్లు టాప్ మూవీస్ తీసిన వారికి ప్రాథాన్యత ఉంటుంది. ఫేడవుట్ అయ్యి సినిమాలు తీస్తున్నామని చెప్పుకునేవాళ్లకు ఇందులో ఆస్కారం ఉండదని చెబుతున్నారు.
ఇక ఇదే విషయంపై ఎన్.శంకర్ ఏమన్నారంటే.. ప్రజాస్వామ్యంలో ఎవరికి వారు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అయితే రహస్య సమావేశాలు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదని చెబుతున్నారు. ఇక ఇంతకుముందే ఏవో రెండు మూడు సినిమాలు తీసిన ఎన్.శంకర్ దర్శకసంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రతిఫలాలు పొందుతున్నారని స్థానిక తెలంగాణ సినిమా పెద్దలు విమర్శించడం తెలిసిందే. తాజా పరిణామంపై ఎన్.శంకర్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో వేచి చూడాలి.