టాలీవుడ్ పరిశ్రమలోనూ కరోనా ప్రభలుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట. రాజమౌళి ఈ విషయాన్ని చెబుతూ ‘కొన్ని రోజుల క్రితం నాకు నా కుటుంబ సభ్యులకు కొద్దిగా జ్వరం వచ్చి తర్వాత దానంతట అదే తగ్గిపోయింది. అయినా పరీక్షలు చేయించుకున్నాం. అందులో కొద్ది మోతాదులో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ అయింది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నాం’ అన్నారు.
అంతేకాదు ‘ప్రస్తుతం అందరం బాగానే ఉన్నాం. ఎలాంటి లక్షణాలు లేవు. అయినా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్నాం. అవి డెవలప్ అయ్యాక ప్లాస్మా డొనేట్ చేస్తాం’ అంటూ స్పూర్తిదాయకంగా మాట్లాడారు. కష్టంలోనూ ప్లాస్మా దానం చేయాలనే సామాజిక బాద్యతను జక్కన్న కుటుంబం మరువలేదు. కాబట్టి వారిని అభినందించాల్సిందే. ఇక ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రాజమౌళి కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.
ఇకపోతే రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది భాగం షూటింగ్ కూడా ముగియగా లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదాపడింది. లాక్ డౌన్ తర్వాత అనుమతులు వచ్చినా ఎక్కడ షూట్ జరిపితే టీమ్ సభ్యులకు వైరస్ సోకుతుందో అని ఇప్పటికీ షూట్ స్టార్ట్ చేయలేదు. అలాంటి జాగ్రత్త ఉన్న జక్కనకు కరోనా సోకడం భాదాకరం. ఆయన, ఆయన కుటుంబం త్వరగా కరోనాను జయించి కోలుకోవాలని కోరుకుందాం.