పరిశ్రమలో దశాబ్ధాల చరిత్ర ఉన్న అక్కినేని కుటుంబాన్ని ఆ ఫ్యామిలీ నటవారసుల్ని చూస్తే చాలు.. చాలా కఠోర సత్యాలు అవగతం అవుతాయి. ఏఎన్నార్ ఒక లెజెండ్. ఆయన నటవారసత్వాన్ని నిలబెట్టడంలో కింగ్ నాగార్జున పెద్ద సక్సెసయ్యారు. అయితే ఆయన కెరీర్ బండి నల్లేరుపై నడకలా సాగలేదు. కెరీర్ ఆరంభం ఎంతో స్ట్రగుల్ అయ్యారు. సక్సెస్ లేక తంటాలు పడ్డారు. కాలక్రమంలో అనుభవం క్రమశిక్షణతో పట్టుదలతో తనని తాను మలుచుకుని స్టార్ హీరోగా ఎదిగారు. కొన్నిసార్లు ప్రయోగాత్మకంగా తనని తాను మార్చుకుని నిరూపించారు. మరికొన్ని సార్లు లక్ కూడా ఫేవర్ చేసింది. ఏఎన్నార్ అండ ఉన్నా తనదైన ముద్ర వేశాకే నాగార్జున పెద్ద స్టార్ అయ్యారు.
ఇప్పుడు నాగార్జున నటవారసుల పరిస్థితి కూడా అందుకు అతీతంగా ఏమీ లేదు. నిన్న మొన్నటివరకూ నాగచైతన్యకు సరైన బ్లాక్ బస్టర్ అన్నదే లేదు. కీలక సమయంలో ఏమాయ చేశావే- 100 పర్సంట్ లవ్ లాంటి బ్లాక్ బస్టర్ లు రాకపోయినా.. ఇటీవల ప్రేమమ్- మజిలీ లాంటి సినిమాలు లేకపోయినా చైతన్య పరిస్థితి ఏమిటన్నది ఊహించగలం.
నాగార్జున రెండో కుమారుడు, నటవారసుడు అఖిల్ పరిస్థితి చూస్తున్నదే. ఇప్పటికే అఖిల్ మూడు సినిమాల్లో నటిస్తే ప్రతిదీ ఫ్లాపే. అఖిల్- హలో- మిస్టర్ మజ్ను.. ఇవన్నీ అతడి కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. పరాజయాలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అఖిల్ ని హీరోగా నిలబెట్టేందుకు నాగార్జున ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. ఎంతగా రేయింబవళ్లు తపించినా ఆశించిన హిట్టు దక్కడం లేదు. అఖిల్ ప్రతిభావంతుడే అయినా.. కింగ్ అండ ఉన్నా.. ఇక్కడ లక్ కూడా ఫేవర్ చేయలేదు. అతడు నాలుగో ప్రయత్నం ఐదో ప్రయత్నం అంటూ ఈదుతూనే ఉంటాడు. ఇక నాగార్జునకు కూడా నాలుగైదు సినిమాలు చేసేవరకూ కొన్నేళ్ల పాటు ఎదురు చూస్తే కానీ హిట్టు రాని సంగతి తెలిసిందే. మరోవైపు సుమంత్ .. సుశాంత్ లాంటి అక్కినేని ఫ్యామిలీ హీరోల మనుగడ ఎలా ప్రశ్నార్థకమైందో చూస్తున్నదే. కానీ కెరీర్ విషయంలో పాజిటివ్ ధృక్పథంతో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా.
ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో చరణ్ ని మించి అల్లు అర్జున్ ఎదిగిన తీరు చూస్తుంటే అక్కడ కూడా నెపోటిజాన్ని మించి గొప్ప ప్రతిభను లేదా కసి పంతాన్ని చూడొచ్చు. బన్నీని మించి ఎదిగేందుకు చరణ్ ఇప్పుడు చేస్తున్న ప్లాన్ పోటీతత్వం బయటకు కనబడుతోంది. ఆ కుటుంబం నుంచి అరడజను పైగా హీరోలు ఒకరిని మించి ఒకరు పోటీపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో హిట్లు లేక చతికిలబడేవారు ఉన్నారు. చరణ్ – బన్ని పెద్ద స్టార్లుగా ఎదిగేందుకు ముందు చాలా ఏళ్ల పాటు ఫ్లాపుల్ని ఎదుర్కొని ఇబ్బంది పడ్డారు. `రంగస్థలం` సినిమా వచ్చే వరకూ చరణ్ ని గొప్ప ఆర్టిస్టుగా గుర్తించని వాళ్లు ఉన్నారు. ధృవ కోసం అతడి మేకోవర్ చూసి పొగడని వాడే లేడు. ఇటీవల చరణ్ అజేయమైన విజయాలతో రేసులో దూసుకెళుతున్నాడు.
క్రిటిక్స్ మెగా వారసుడైనా చరణ్ ని అస్సలు వదిలిపెట్టనే లేదు. సిసలైన ప్రతిభ బయటికి తీసినప్పుడు పొగిడారు. సరిగా చేయకపోతే విమర్శించారు కూడా. మెగా కాంపౌండ్ నుంచే వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇన్నాళ్లు ఈదాడు. కెరీర్ ఆరంభం ఒక హిట్టు కొట్టి ఐదారేళ్లు హిట్టు అన్నదే లేక ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఇన్నాళ్టికి తిరిగి హిట్లు కొట్టి కెరీర్ ని ట్రాక్ లోకి తేగలిగాడు. ఇక మెగా కాంపౌండ్ లో బెస్ట్ హీరో ఎవరు? అంటే చరణ్ – బన్ని – సాయిధరమ్ కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనేవాళ్లు ఉన్నారు. మెగా కుటుంబంలోనే విలక్షణమైన స్క్రిప్ట్ సెలెక్షన్ తో అతడు ఆ ముద్ర తనకు తానుగానే తెచ్చుకోగలిగాడు. వరుణ్ తేజ్ సైలెంట్ కిల్లర్ లా ఎదిగేస్తున్నాడు పోటీపడుతూ. వీళ్లను ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కొంత తోడు పెట్టినా కానీ చెత్త సినిమాలు చేస్తే ప్రేక్షకులు క్షమించలేదు. నటవారసులు అని చూడకుండా కర్కశంగా చెత్త సినిమాల్ని చూసేందుకు థియేటర్లకు రాలేదు.
నందమూరి కుటుంబంలో నటసార్వభౌముడు ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన బాలయ్యకు కులం పిచ్చి ఉందని ప్రచారమైనా.. ఆయన చాలాసార్లు బయటి ప్రపంచంలోని ట్యాలెంటుని మెచ్చుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ట్యాలెంటును ఏ శక్తీ ఆపలేకపోయింది. అతడికి బాలయ్య అభిమానులు సహా రాజకీయ విభాగంలో ఓ సెక్షన్ వ్యతిరేకంగా పని చేసినా ఎవరూ ఆపలేకపోయారు. కులంతో పని లేకుండా మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్ కి అతడు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు.
ఇక బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలు టాలీవుడ్ లో కొందరు ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ.. శ్రీకాంత్ లాంటి స్టార్లకు లైఫ్ నిచ్చింది మెగాస్టార్.. మెగా ఫ్యాన్స్. కొంత కులం ఉంది.. కొంతవరకూ నెపోటిజం కూడా ఉంది. కానీ చాలాసార్లు మెగా హీరోలు కూడా కులం చూడరు. బయటి హీరోల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నచ్చిన చిన్న హీరోల్ని నెత్తిన పెట్టుకుని వారి సినిమాలకు ప్రచారం చేస్తున్నారు.
యూత్ స్టార్ నితిన్ రెడ్డికి పవన్ కల్యాణ్ సపోర్టు ఉంది.. నితిన్ పవన్ కి అభిమాని.. నితిన్ అంటే పవన్ కి అభిమానం. అలాగే సుధాకర్ రెడ్డి కుటుంబంతో మెగా స్టార్- పవర్ స్టార్ ఫ్యామిలీ అనుబంధం దశాబ్ధాల నాటిది. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అన్ని కులాల డిస్ట్రిబ్యూటర్లతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎదిగిన వాళ్లు ఎదిగిన వారి దోస్తానాలో తలమునకలుగా ఉన్నారు. ఆ బంధం విడదీయలేనిదిగానూ మారింది. ఇక్కడ చాలా సందర్భాల్లో కులాన్ని చూసే వీల్లేకుండా పోయింది. సినీవ్యాపార రంగంలో చాలా సెక్షన్లలో సత్సంబంధాలే ఆలంబనగా మారాయి. ఫిలింఛాంబర్ – నిర్మాతల మండలి వర్గాల్లో కుల రాజకీయాలు ఉన్నా సినిమాల రిలీజ్ లపై వీటి ప్రభావం ఉన్నా.. అక్కడా మంచి సినిమాకి సపోర్టు దక్కుతోంది.
చిన్న హీరోల్లో పెద్దగా ఎదిగిన హీరోలు ఉన్నారు. నాని – శర్వానంద్- నిఖిల్- అడివి శేష్ అందుకు ఎగ్జాంపుల్. నానీ -నిఖిల్- శేష్ లాంటి ట్యాలెంటుకి మెగా సపోర్ట్ రాజమౌళి సపోర్ట్ ఇంకా చాలా ఉన్నాయి. చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు నానీకి సపోర్ట్ నిచ్చిన సందర్భాలెన్నో. నానీ బాలకృష్ణకు అభిమానిని అని బహిరంగంగానే ప్రకటించాడు. చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుంటానని పబ్లిక్ వేదికలపై చెప్పి మెగాభిమానుల మనసు దోచాడు. పరిశ్రమలో రవితేజ తర్వాత ప్రతిభతో స్వయంకృషితో ఎదిగిన నేచురల్ హీరోగా నానీకి పేరొచ్చింది. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కి అగ్ర హీరోల సపోర్ట్ ఉంది. చిరంజీవి- బాలకృష్ణ ఎంకరేజ్ చేశారు. గొప్ప వెటరన్ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా వచ్చిన జగపతిబాబుని పరిశ్రమ పెద్ద హీరోలే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తానంటే బాలయ్య.. ఎన్టీఆర్.. చరణ్ ఎంకరేజ్ చేస్తున్నారు. గూడఛారి ఫేం అడివి శేష్ కి మహేష్ ఛాన్సులిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కాంబో మేజర్ అనే సినిమా చేస్తున్నారు. నిర్మాతలుగా చరణ్ .. అల్లు అరవింద్ అవకాశాలిచ్చేందుకు రెడీగా ఉన్నారు.
శర్వానంద్ కి చరణ్ క్లోజ్ ఫ్రెండ్.. చిరు సపోర్ట్ ఎప్పుడూ ఉంది.. ఆరంభం చిన్న పాత్రలతో మొదలై హీరో అయ్యి పెద్ద హీరోగా ఎదుగుతున్నాడు. చాలా భయంకరమైన ఫ్లాపులు ఎదుర్కొని కూడా అవకాశాలు అందుకుంటున్న హీరో శర్వానంద్. నానీకి ఒక టైమ్ లో బ్యాడ్ ఫేజ్ ఊపిరాడనివ్వలేదు. ఈ ఇద్దరూ ఏలిన్నాటి శనిని వదిలించుకుని ఎదుగుతున్న హీరోలు అంటే తప్పేమీ కాదు. అంతెందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస ఫ్లాపులు.. ఏలిన్నాటి శని గురించి తెలియనిదా? `పవర్` ఉన్నా పనికొచ్చిందా? అతడి ఛరిష్మా అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకరకంగా ఆదుకుంది అంతే.
రాజమౌళి కొరటాల లాంటి ట్యాలెంటును కులం ఎప్పుడూ ఆపలేకపోయింది.. అల్లు అరవింద్ కుల రాజకీయాలు చేస్తారు కానీ కులంతో పని లేకుండా ట్యాలెంటును వాడుకుంటాడు. ఇంచుమించు దగ్గుబాటి సురేష్ బాబు.. దిల్ రాజు లాంటి ప్రముఖులు కులం కంటే ట్యాలెంటునే చూసేందుకు ఇష్టపడతారు. ఇటీవల ఎందరో అనామకుల సినిమాలకు ప్రచారం చేసి ఆ సినిమాల వల్ల తాము లబ్ధి పొంది చివరికి టూవేలో పరిశ్రమకు ట్యాలెంటుకు మంచి చేస్తున్నారు.
పరిశ్రమలో ఎప్పుడూ ఒక పనికిమాలిన సెక్షన్ ఉంటుంది. మధ్యలో మీడియేటింగులు చేస్తూ.. కులం అంటించి హీరోల్ని బ్యాడ్ చేస్తారు… బాలయ్యకు కులం అంటించింది.. ఎన్టీఆర్ తో పడదని ప్రచారం చేసింది ఆ సెక్షనే. ఆ తర్వాత రాజకీయాల వల్ల అలాంటి ప్రచారం పెద్దదయ్యింది.. ఆయనది చిన్న పిల్లోడి మనస్తత్వం అని చెప్పేవాళ్లే ఆయనకు కులం అంటిస్తారని ఒక పెద్ద నిర్మాత లోగుట్టు గురించి చెప్పారు. ఘట్టమనేని కృష్ణ వారసుడిగా వచ్చినా మహేష్ కెరీర్ ఆరంభం ఎన్నో పరాజయాలు ఎదుర్కొని చివరికి స్టార్ గా నిలిచాడు. ఇటీవల సూపర్ స్టార్ గా హవా సాగిస్తున్నాడు. కృష్ణ అల్లుడు మహేష్ కి బావ అయినా సుధీర్ బాబు ఎదిగేందుకు ఇంకా చాలా చెమటోడుస్తున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి పలువురు నవతరం హీరోలు వస్తున్నారు. వీళ్లు ఎంతవరకూ ఎదగాలి అన్నది ప్రేక్షకులే నిర్ణయించాలి. కులం నటవారసత్వం కొంతవరకే పని చేస్తాయి. ఆ తర్వాత ఎవరకి వారే ఈదాలి. ప్రతి సినిమాని మొదటి సినిమాగా భావించి కష్టపడాలి.
ఇటీవల స్టార్ డమ్ అన్న పదానికి అర్థం లేకుండా పోతోంది. సీన్ మొత్తం మారుతోంది. డిజిటల్ రాక ఓటీటీ వల్ల స్టార్ డమ్ తో పని లేకుండా పోయింది.. స్టార్ పవర్ ని మించి కంటెంట్ పవర్ పెరిగింది..నెపోటిజం స్టార్లకు ఇక పనవ్వదు.. ఎన్ని అండదండలు ఉన్నా.. సూపర పవర్స్ పని చేస్తున్నా.. నెపోటిజం హీరోలు చాలా మంది ఫెయిలవుతూనే ఉన్నారు.
ఒక రకంగా ది గ్రేట్ పెర్ఫామర్ మోహన్ బాబు నటవారసులు మంచు హీరోలు ఫెయిల్యూర్స్ వెనక కారణమేంటో జనాలే విశ్లేషిస్తుంటారు. మంచు విష్ణు.. మనోజ్ అలుపెరగని పోరాటం చేసి చివరికి రేసులో వెనకబడ్డారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అండదండలు ఉన్నా సొంతంగా వేదికను సెటప్ చేసుకోవడంలో చతికిలబడ్డారు. మళ్లీ మళ్లీ దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ సరైన ఫలితం దక్కడం లేదు. నటవారసులే కదా మరి ఎందుకు ఎదగలేకపోయారు?
ఏ కులం సినీనేపథ్యం లేకుండానే విజయ్ దేవరకొండ లాంటి ట్యాలెంట్ తనకు తానే టాలీవుడ్ హిస్టరీలో ఒక పేజీని క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా సంచలన విజయాలతో దూసుకొచ్చాడు. అంతే పెద్ద ఫ్లాపులొచ్చినా ప్రజల మనసు దోచాడు. ఇండస్ట్రీలో అగ్ర హీరోల మెప్పు పొందాడు. అగ్ర నిర్మాతలు కాపు కాసుకుని ఎదురు చూసేలా చేశాడు. లక్ కి ప్రతిభను జోడించి మిరాకిల్స్ చేస్తున్నాడు. అతడిని ఏ కుల
శక్తులూ ఆపలేదు. నైజాం హీరో అనే ప్రాంతీయవాదం ఆపలేదు. ఆంధ్రాలో రౌడీకి చెవులు కోసుకునే వీరాభిమానులున్నారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ అసాధారణం. దేవరకొండ కాకినాడనో గోదారి నేపథ్యమో లేకుండా సినిమాలు చేయడం లేదు. దేవరకొండ హీరో అయ్యాక నాయకులు కులాన్ని కలుపుకుని ఉండొచ్చు. అంతకుముందు అతడి వెంట ఆ కులం లేదు. వేరొక అగ్రకులం లిఫ్టిచ్చింది మరి. అప్పుడు వాళ్లెవరూ కులాల్ని చూసి ఛాన్సులివ్వలేదు.
దిల్ రాజు .. దానయ్య ఫ్యామిలీ హీరోల్ని తెస్తున్నారు .. ఎవరు మిగులుతారో తెలీదు.. ఎవరొచ్చినా ట్యాలెంట్ పరంగా చాలా చూపించాలి.. వినమ్రత .. క్రమశిక్షణ.. మంచివాడు అందరివాడు అనిపించుకోవడం చొరవ.. పబ్లిసిటీ.. ఇలా చాలా చాలా కారణాలు ఇండస్ట్రీలో మనుగడకు అవసరం. కులం కొంతవరకూ.. నెపోటిజం కొంతవరకూ.. తోడు పెడతాయేమో! ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లో ఏ ఆటా నడవదు.. ప్రతిభ చాకచక్యం దూసుకుపోయే తత్వం నడిపిస్తున్నాయి.. నటవారసుల్ని నిలబెట్టేందుకు వందల కోట్లు వెదజల్లినా చాలామందికి అవన్నీ గంగలో పోసిన చందమే అయ్యింది.
మంచి స్నేహాలు నడిపిస్తున్నాయి..
కులం మతం ప్రాంతం కంటే పాజిటివ్ యాటిట్యూడ్ ముఖ్యం..
పెద్దవాళ్ల దృష్టిలో పడడం చాలా చాలా ఇంపార్టెంట్..
అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని తీరాలి…
ప్రతి సినిమా మొదటి సినిమానే అనుకుని కసిగా పని చేయాలి..
`బిచ్చగాడు`తో పెద్ద స్టార్ అయ్యాడు విజయ్ ఆంటోని.. అతడికి మీడియాలోనూ ఫ్యాన్స్ అయ్యారు. అలా పరిశ్రమకు వచ్చే ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలి. ఎదగాలి. కులానికి మతానికి కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే నెపోటిజానికి భయపడాల్సిన పనే లేదు.
-శివాజీ.కె