స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందనున్న సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఈ సారి త్రివిక్రమ్ తన తాజా చిత్రంలో చెల్లి సెంటిమెంట్ ని కథలో గట్టిగా స్టెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సబ్ ప్లాట్ లా కాకుండా మెయిన్ కథనే చెల్లి చుట్టూ తిరిగేలా డిజైన్ చేసాడంటున్నారు. ఈ మధ్యకాలంలో సిస్టర్ సెంటిమెంట్ కథలు ఎవరూ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాడట.
అయితే చెల్లి సెంటిమెంట్ అనగానే గోరింటాక్ టైప్ ఏడుపులు పెడబొబ్బలు ఉండవట. కథకు ఎమోషనల్ డెప్త్ ఇచ్చేలా ఉంటుందిట. అలాగే అల్లు అర్జున్ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో అన్ని కొత్తగా కనిపించేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదే కనక నిజమై ఈ చెల్లి సెంటిమెంట్ కనుక పడితే మహిళల్లో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ వస్తుంది. అది ఆయన ఇమేజ్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే అల్లు అర్జున్ తో డీజే సినిమాకి పనిచేసింది.
అల్లు అర్జున్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసారు. ఆ రెండింటికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘అలకనంద’ అనే పేరును టైటిల్ గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
గీత ఆర్ట్స్ మరియు యు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.