`పోలీసులూ వదలొద్దు` అంటూ కంగన వార్నింగ్
బాలీవుడ్ లో నటవారసత్వం.. స్వాభిమానం .. స్వపక్షం వంటి విషయాలపై ఫైర్ బ్రాండ్ కంగన నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. హిందీ చిత్ర సీమలో పెద్దల్ని ఎదురించిన ధీశాలిగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పరిశ్రమలో ఖాన్ లు.. చోప్రాలు.. రోషన్ లు.. కపూర్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నటవారసుల్ని పరిచయం చేసే కరణ్ జోహార్ ని అయితే ప్రతిసారీ ఏదో ఒక విధంగా తాట తీస్తూనే ఉంది. వీళ్లంతా ఒక మాఫియాగా ఏర్పడి కుటుంబ హీరోల్ని కాపాడుకుంటున్నారనేది కంగన ఆరోపణ. అంతేకాదు ఇండస్ట్రీలోకి బయటి ట్యాలెంటును రానివ్వకుండా తొక్కేస్తున్నారని తీవ్రంగా ఆరోపిస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం వెనక ఆత్మహత్యకు కారణం వీళ్లేననేది కంగన ఆరోపణ. తాజా మీడియా ఇంటర్వ్యూలో కంగన మరోసాని నిప్పులు చెరిగింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామితో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఆ నాలుగు రాబందులను ముంబై పోలీసులు వద్దలొద్దు.. వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేసింది. బంధుప్రీతి వేధింపులకు గురి చేసేది ఆ నాలుగు కుటుంబాలేనని కంగన ఫైరైంది. పీక్కుతినే రాబందుల్ని ఉరి తీయాలని తనదైన శైలిలో విరుచుకుపడింది.
వరుసగా హిట్ చిత్రాల్లో నటించిన సుశాంత్‌ను ఫ్లాప్ హీరో అంటూ కామెంట్ చేసిన కరణ్ జోహర్, రేపిస్ట్ అంటూ కామెంట్ చేసిన సీనియర్ జర్నలిస్టు రాజీవ్ మసంద్, డ్రగ్గిస్ట్ అంటూ కించపరిచిన మహేష్‌భట్‌ను ముంబై పోలీసులు ఎందుకు ప్రశ్నించరు? సూశాంత్ సూసైడ్‌లో భన్సాలీ, కరణ్ జోహర్, రాజీవ్ మసంద్, మహేష్ భట్ వంటి వారిని ఎందుకు పట్టించుకోరు? అంటూ పోలీసుల్ని కంగన నిలదీసే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ లో సూసైడ్ మాఫియాగా మారిన ఆ ప్రముఖుల్ని ఉరి తీయాలని కోరింది కంగన. శిక్షలు విధించి మాఫియాల్ని ఉరి తీయకపోయినా కనీసం శిక్షించాలని నివేదించింది.
భాయ్ (సల్మాన్) సరసన సుల్తాన్ లో నటించకపోతే కెరీర్ ముగిసినట్టేనని తనను ఆదిత్య చోప్రా బెదిరించారని కూడా కంగన వెల్లడించింది. భాయ్ మాటను వ్యతిరేకించవద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారట. ఇలా బెదిరించే హక్కు ఎవరికి ఉంది? అని ప్రశ్నించింది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో కరణ్ వ్యాఖ్యను కంగన తూర్పారబట్టింది. బాలీవుడ్ నుంచి కంగనను తరిమివేయాలని కరణ్ జోహర్ అలాంటి గొప్ప వేదికపై ఎలా వ్యాఖ్యానిస్తారు? అని నిలదీసింది క్వీన్. ఆ సమయలో సుశాంత్ సింగ్ తనకు అండగా నిలిచాడని సుశాంత్ కి ఇలాంటి సత్కారాలు ఎన్నో జరిగాయని కూడా కంగన వెల్లడించింది. సుశాంత్ సింగ్ రేపిస్ట్, డ్రగ్గిస్ట్, డైరెక్టర్లను కొడుతాడు!! అంటూ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ పేరు పెట్టకుండా కథనాలు రాశాడని కూడా ఆరోపించారు కంగన. భట్, జోహర్, చోప్రా ఫ్యామిలీలు బాలీవుడ్‌లో బలమైనవి. వాళ్లను తప్పకుండా పోలీసులు విచారించాలని కంగన కోరారు. నన్ను వేధించినట్టే సుశాంత్ ని.. ఇకపై ఎందరినో వేధిస్తారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. కరణ్ .. ఆదిత్య చోప్రా తండ్రులు వీళ్లలా చీప్ గా ప్రవర్తించలేదని స్టార్లకు సాయం చేశారని కంగన తెలిపింది. వారంతా విలువల్ని కాపాడితే వీళ్లు వలువలు వలిచేశారని కూడా దుయ్యబట్టింది. షారూక్ ని ప్రమోట్ చేసిన యష్ చోప్రా అతడి పారితోషికంలో సగం తాను తీసుకున్నారు తప్ప పరిశ్రమలో తొక్కేయలేదని కూడా కంగన రహస్యాన్ని బహిర్గతం చేశారు.