‘రణరంగం’ …ఎన్టీఆర్ మధ్య నిషేధం తో లింక్, వివాదం కాదు కదా?
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ తేదీన విడుదల కావాల్సిన ప్రభాస్ ‘సాహో’ చిత్రం వాయిదా పడటంతో అడవి శేష్ ‘ఎవరు’, శర్వానంద్ ‘రణరంగం’ చిత్రాలు ఆరోజు విడుదలకు హడావిడిగా రెడీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రైలర్ లో శర్వా లుక్, డైలాగ్ డెలవరీ, బాడీ లాంగ్వేజ్ రొటీన్ కు భిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ మధ్య నిషేధకాలం నాటి బ్యాక్ డ్రాప్ తీసుకుని, అప్పుడు లిక్కర్ కింగ్ గా ఎదిగిన ఓ వ్యక్తి కథ చెప్పాలనుకోవటం మరీ ఆసక్తి రేపుతోంది. అయితే మధ్య నిషేధ సమయంలో లిక్కర్ కింగ్ గా ఎదగటం అంటే అప్పటి ప్రభుత్వం ఫెయిలనట్లు చెప్తున్నట్లా అని కొందరు కామెట్స్, సోషల్ మీడియాలో చర్చలు చేయటం అప్పుడే మొదలెట్టారు. మీరూ ఆ ట్రైలర్ ని చూడండి.
చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు సుధీర్ వర్మ ‘రణరంగం’ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారినీ ఈ చిత్రం అలరిస్తుంది. మన తెలుగులో టాలెంట్ ఉన్న నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. ‘గ్యాంగ్ స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్‌తో కలిసి ఉంటుంది.
‘గ్యాంగ్ స్టర్’ అయిన హీరో జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రంపై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన ‘గ్యాంగ్ స్టర్’ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది..’’ అన్నారు.