పెళ్లైన తర్వాత కూడా తెలుగు .. తమిళ భాషల్లో సమంత తన క్రేజ్ ను కొనసాగిస్తూనే వస్తోంది. అయితే సమంత ఎంచుకునే పాత్రల విధానం మారింది. గ్లామర్ పాత్రలకు ఆమె ఆసక్తి చూపటం లేదు. తన పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉంటేనే సై అంటోంది. ఇప్పుడు అదే పద్దతిలో తమిళంలో ఆమె తాజా చిత్రంగా ‘సూపర్ డీలక్స్’ రూపొందింది.
ఈ సినిమాలో సమంత పెళ్లయినా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకునే యువతిగా కనిపించి షాక్ ఇస్తుందిట. అలాగే తనతో అక్రమ సంబంధం వున్న వ్యక్తిని హత్య చేసి అతడి శవాన్ని భర్తతో కలిసి మాయం చేసే సంచలన పాత్రలో ఆమెని చూడబోతున్నామని తమిళ మీడియా అంటోంది.
ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి .. పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఫహాద్ ఫాజిల్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ లభించింది.
త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగులో సమంతకి .. రమ్యకృష్ణకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది కనుక, ఈ సినిమా వసూళ్లు భారీగా వుంటాయనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా తెలుగులో డబ్బింగ్ అవటం గ్యారెంటీ.