‘సాక్షి’ఇంటర్వూలో అది చెప్పా, రాయలేదు : కోన వెంకట్

ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఇటీవల సాక్షి పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వటం, అది సంచలనంగా మారటం అందరికి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆయన చేసారంటూ వచ్చిన వాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి. మొదటి నుంచీ ప‌వ‌న్ క‌ల్యాణ్ నా సోల్‌మేట్ అని అంటుండేవారు కోన. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కూడా కోన‌ని కూడా బాగా అభిమానిస్తూ వ‌స్తూ..ట్విట్ట‌ర్‌లో ఫాలో అవుతున్నారు. అతే ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఇటీవ‌ల కోన వెంక‌ట్ చేసిన విమ‌ర్శ‌లు కు వారు షాక్ అయ్యారు. మండిపడ్డారు.

సోషల్ మీడియాలో రకరకాలుగా కోనను విమర్శిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో కోన ఇపుడు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. సాక్షికు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పిన కొన్ని విషయాలను ప్రచురించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ ప్రకటనను వెంకట్ విడుదల చేశారు. ‘సాక్షి’ పేపర్‌లో వచ్చిన నా ఇంటర్వ్యూ కి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వదలుచుకున్నానంటూ ఓ ప్రకటనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“మా బావగారైన ద్రోణంరాజు శ్రీనివాస్‌గారు వైజాగ్ దక్షిణ నియోజకవర్గము నుంచి వైసీపీ అభ్యర్థి‌గా పోటీచేస్తున్నారు. అలాగే నా మిత్రుడైన ఎంవీవీ సత్యనారాయణ గారు వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వీరిద్దరికి ప్రచారం చేయడానికి వైజాగ్ వెళ్లడం జరిగింది. అప్పుడు ‘సాక్షి’ పేపర్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు.

సాక్షికు ఇచ్చిన ఇంటర్వూలో నా మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అడగడం జరిగింది. తన నిజాయితీ గురించి, తన వ్యక్తిత్వం గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది. పొలిటికల్‌గా తనకి మంచి జరగాలని కోరుకునేవాళ్లలో నేను మొదటి వ్యక్తిని అని చెప్పడం కూడా జరిగింది(ఇది రాయలేదు).

పొలిటికల్‌గా మీరు విభేదించే అంశాలు ఉన్నాయా? అని అడిగినప్పుడు, మాయావతి గారితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో తనని మిస్ గైడ్ చేసారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎందుకు చెప్పానంటే, కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్.. కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా తనే స్వయంగా వాళ్ళ సామరస్య పాలన గురించి మీడియాతో చెప్పడం జరిగింది.

అందుకే ఇప్పుడు తను ఇస్తున్న ప్రకటనల మీద నాకు అనుమానం వచ్చింది అంతే. చివరిగా నేను చెప్పేదేంటంటే, మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్ధిక స్థోమతలు, ఇవేవి స్నేహానికి అడ్డుగోడలు కాకూడదు. నేను మరోసారి హృదయపూర్వకంగా అతణ్ణి మంచే కోరుకుంటాను.. ఆయన అనుకున్నది సాధించాలి” అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.