2.0 త‌ర‌హా లోటుతో సాహో రిలీజ్?

సాహో బిజినెస్.. నిర్మాత‌లు సేఫ్ కాద‌ట‌!

2.0 చిత్రాన్ని దాదాపు 650 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించింది లైకా సంస్థ‌. ర‌జ‌నీకాంత్- శంక‌ర్ కాంబినేష‌న్ కి ఉన్న క్రేజు దృష్ట్యా ఆ సినిమాకి దాదాపు 500 కోట్ల మేర బిజినెస్ సాగింద‌ని ప్ర‌చార‌మైంది. అయితే బిజినెస్ సాగినంత మేర‌కు థియేట‌ర్ల నుంచి షేర్ లేదా నెట్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఆ ప్ర‌భావం `భార‌తీయుడు 2`పైనా ప‌డింది. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న `భార‌తీయుడు 2` చిత్రానికి భారీ బ‌డ్జెట్ పెట్టేందుకు లైకా సంస్థ వెన‌కాడుతోంది. భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు ఉండే రిస్క్ ఇది.

అదంతా అటుంచితే.. ప్ర‌స్తుతం రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతున్న సాహో స‌న్నివేశ‌మేంటి? ఈ సినిమాకి పెట్టిన పెట్టుబ‌డి ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో వెన‌క్కి వ‌చ్చేసిన‌ట్టేనా? అంటే .. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ సినిమాకి 320 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో వెన‌క్కి వ‌చ్చేసింది. అందుకు బాహుబ‌లి క్రేజ్.. ప్ర‌భాస్ క‌రిష్మా ప్ల‌స్ అయ్యాయి. అయినా ఇంకా 30 కోట్ల మేర లోటు పూడ్చాల్సి ఉంద‌ట‌. ఆ మొత్తం కూడా తిరిగి వ‌చ్చేస్తే ఆ మేర‌కు నిర్మాత‌లు సేఫ్ అయిన‌ట్టే. ఇక ఆ మొత్తాన్ని శాటిలైట్ బిజినెస్ .. ఆడియో రైట్స్ స‌హా ప‌లు మార్గాల్లో రాబ‌ట్టనున్నార‌ని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ సాహోకి రిలీజ్ రోజే హిట్టు.. బంప‌ర్ హిట్టు అన్న టాక్ వ‌స్తేనే అంత పెద్ద మొత్తాల్ని వెన‌క్కి రాబ‌డుతుంది. అప్పుడే డిస్ట్రిబ్యూష‌న్ వ‌ర్గాలు సేఫ్ అయ్యేది. మ‌రి ఆగ‌స్టు 30న రిలీజ్ కి వ‌స్తున్న సాహో బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎలాంటి ఫీట్ వేస్తుందో చూడాలి.