RRR చిత్రంతో సెన్సేషన్స్ కి రెడీ అవుతోంది ఆలియాభట్. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంతో తన రేంజు మారిపోతోందని కలలు గంటోంది. అయితే ఈ అమ్మడి కలలు కల్లలు కానున్నాయని తాజా సన్నివేశం చెబుతోంది. ఇక వరుసగా మూడు నాలుగు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఆలియాను కరోనా మహమ్మారీ ఓ రేంజులో షంటేస్తోంది. ఇప్పటికే బ్రహ్మాస్త్ర.. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రాల సన్నివేశమేమిటో తెలిసిందే. ఇవి రెండూ త్వరలో రిలీజై తనకు బిగ్ బ్రేక్ నిస్తాయని ఆశించింది ఆలియా. వీటితో బాలీవుడ్ లోనే నంబర్ 1 హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కలలుగంది. కానీ ఏం దురదృష్టమో కానీ 2020 ఈ అమ్మడికి అశనిపాతంలా తయారైంది.
కరోనా కల్లోలం వల్ల ఇప్పట్లో లాక్ డౌన్ లు ఎత్తేయరు. థియేటర్లు ఓపెనవ్వవు. షూటింగులు లేవు. దీంతో ఆలియా డ్రీమ్ ప్రాజెక్టులన్నీ అంపశయ్యపైనే ఉన్నాయి. షూటింగ్ పూర్తయినా ఇప్పట్లో ఏదీ రిలీజ్ కాదు. రిలీజైనా జనం థియేటర్లకు వస్తారా రారా? అన్న సందిగ్ధత వెంటాడుతోంది. ఇక 2021 సంక్రాంతికి వస్తుందనుకున్న ఆర్.ఆర్.ఆర్ సైతం అప్పుడు వస్తుందా రాదా? అన్న సందిగ్ధత నెలకొంది. అంతకుముందు రావాల్సిన బ్రహ్మాస్త్ర సైతం సందేహమేనన్న వాదనా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగానే ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం `గంగూభాయి కతియావాలా` పరిస్థితి ధీనంగానే ఉంది. ఈ మూవీ మెజారిటీ పార్ట్ కామటిపురా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలన్నది భన్సాలీ ప్లాన్. అందుకోసం భారీ కామటిపురా సెట్స్ ని నిర్మించారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది. కరోనా కల్లోలం ఎప్పటికి తగ్గుతుందో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తేలని పరిస్థితి ఉంది. అయితే అప్పటివరకూ స్టూడియో వాళ్లకు రెంట్ కట్టాల్సి ఉందిట. ఆ రెంటు భారీగా ఉండడంతో అలా చెల్లించే కంటే సెట్లు కూలదోసి తిరిగి అవసరం అయినప్పుడు నిర్మించుకుంటేనే బెటర్ అని భన్సాలీ టీమ్ ప్రిపేరైంది. దీంతో దాదాపు 12 కోట్ల విలువ చేసే సెట్లను కూల్చాల్సి వచ్చిందట. ఓవరాల్ గా చెల్లించిన రెంటు కలిపి 15 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రముఖ పింక్ విల్లా బాలీవుడ్ వెబ్ సైట్ పేర్కొంది. 60 వ దశకంలో కామటిపురా ఎలా ఉండేదో ప్రతిబింబిస్తూ నిర్మించిన సెట్ కాబట్టి అంత పెద్ద మొత్తం ఖర్చయ్యింది. ఇప్పుడు అదంతా గంగ పాలైందన్న టాక్ వినిపిస్తోంది. కరోనా విసిరిన పంజా అలాంటిది మరి.