‘హీరామండి’ మరువలేని అనుభవం.. మనీషా కోయిరాలతో నటించడం అదృష్టం: సోనాక్షి

ప్రస్తుతం ‘హీరామండి’కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి సిన్హా తన సహనటి మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. ‘నాకు మనీషా అంటే ఎంతో ఇష్టం. ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సిరీస్‌ మొత్తం చూసిన తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో భాగంగా ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్‌ చూశాక నేను వాటిని ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే సారీ చెప్పాను. ఆమె గొప్ప నటి. తన సహనటులను ఎంతో ప్రోత్సహిస్తారు. షూటింగ్‌ మొత్తం సరదాగా గడిపాం. అంత గొప్ప నటితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మళ్లీ ఆమెతో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అన్నారు.

ఇక సంజయ్‌ లీలా భన్సాలీ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన దర్శకత్వంలో నటిస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్‌కు ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. భన్సాలీ నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత గొప్ప పాత్రను ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని చెప్పారు. ‘హీరామండి’లో సోనాక్షీ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నెగెటివ్‌ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ఇతర కీలకపాత్రలు పోషించారు. దీనిపై బాలీవుడ్‌స్టార్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.