పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలకు బ్రేక్ వేసి ప్రస్తుతం సినిమాలపై శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో వరుసగా స్క్రిప్టులు విని డైరెక్టర్లను ఫైనల్ చేసే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. వకీల్ సాబ్ బ్యాలెన్స్ చిత్రీకరణ పూర్తవ్వగానే తదుపరి క్రిష్ తో పీరియాడిక్ మూవీ విరూపాక్ష ను పూర్తి చేస్తారు. ఇది వచ్చే ఏడాది విడుదలవుతుంది.
ఆ తర్వాత కూడా వరుసగా కమిట్ మెంట్లతో దర్శకులను లాక్ చేశారు పవన్. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కి ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చేశారు. ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇది కెరీర్ 28వ సినిమా కాగా.. తదుపరి 29వ సినిమాని బాబీ లేదా డాలీతో చేస్తాడని చెబుతున్నారు.
ఆ ఇద్దరితో పాటు క్రాక్ ఫేం గోపిచంద్ మలినేని లైన్ లోకొచ్చారు. అతడు ఇప్పటికే లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడట. స్క్రిప్టు వర్క్ కూడా చేస్తున్నారని తెలిసింది. మాస్ మహారాజా రవితేజ కు రెండు హిట్లు ఇచ్చిన మలినేని ప్రస్తుతం క్రాక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్న క్రైసిస్ వల్ల వాయిదా పడింది. గోపిచంద్ మలినేని.. పవన్ కోసం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసి సినిమాని ఖాయం చేసుకుంటారన్నమాట.