తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమా ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు.
దగ్గుపాటి రానా పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఆయన కొత్త లుక్ ని విడుదల చేసారు దర్శక నిర్మాతలు. రానా ఈ పాత్రలో అచ్చు గుద్దినట్లు ఒదిగిపోయారని ఆ పోస్టర్ చూసిన వారంతా చెప్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబులా రానా అదరకొట్టాడు.
ఇప్పటికే ఈ చిత్రంలో రానా నటించే పోర్షన్ పూర్తైంది. సినిమాలో కూడా ఈ పాత్ర మరో స్థాయిలో ఉండబోతుందని తెలుస్తుంది. కేవలం నందమూరి తారకరామారావు అల్లుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ..రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రస్థానం అద్వితీయం. అందుకే ఈ పాత్రపై ప్రత్యేక దృష్టిపెట్టి కేకపెట్టిస్తున్నారు క్రిష్.
రానా మాట్లాడుతూ ఇది తనకు చాలా పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అలాగే తాను ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. తనకు ఇలాంటి పాత్రలంటే ఇష్టమని, అందుకే ముఖ్యమంత్రి పాత్ర చేయడానికి ఒప్పుకున్నానని రానా స్పష్టం చేశారు. ఏ పాత్రనైనా చదివి అంచనా వేయకూడదని, ఎంత బాగా తెరపై చూపించగలిగామన్నదే ముఖ్యమని ఆయన వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో విద్యా బాలన్, ఇతర కీలక పాత్రల్లో నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్, కైకాల సత్యనారాయణ, రకుల్‌ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, మంజిమా మోహన్, భరత్‌రెడ్డి, తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ను కొత్త ఏడాదిలో జనవరి 9న, రెండో భాగం ‘యన్.టి.ఆర్ – మహానాయకుడు’ను జనవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్‌ని, 21న నిమ్మకూరులో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.