-సికిందర్
Rating: 1.5
సూపర్ హీ – మాన్ బాడీ బిల్డప్ తో కొణిదెల రామ్ చరణ్ తేజ్ అట్టహాసంగా బోయపాటి వారి అధ్వర్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ప్రేక్షకులిక కోడి పందాలు మానేసి కొణిదెల హైపర్ మాస్ పోరాటాలు చూస్తూ బిజీ అయిపోవాలి. ‘వినయ విధేయ రామ’ టైటిల్ కూడా పండగ పూట భక్తి భావాన్ని ప్రేరేపిస్తోంది. రాముణ్ణి చూసినంత వినయ విధేయతలతో పండగ ప్రేక్షకులు రామ్ చరణ్ వెండితెర తేజస్సుకి జయజయధ్వానాలు చేయాలి. బోయపాటి వారి రక్తపాతాల సంక్రాంతి కానుకని బీభత్స భరితంగా అందుకుని తరించాలి.
బోయపాటి ప్రతిభ గత ‘జయ జానకి నాయక’ లోనే కాలం చెల్లిన కథా కథనాలతో, పాత్రలతో, చిత్రీకరణతో ప్రమాదకర స్థాయికి పడిపోయిన వైనాన్ని మర్చిపోవాలి. శ్రీను వైట్ల సింగిల్ విండో స్కీము టెంప్లెట్ లాగే, బోయపాటి శ్రీను యాక్షన్ విండో టెంప్లెట్ ఒకటుందని, అదే ఇంకా రిపీటవుతోందనీ, కొత్తగా టైటిల్స్ మాత్రమే లయబద్ధమైన పురాణ పదసంపదతో పవిత్రంగా వుంటున్నాయని గమనించి, ప్రస్తుత భీకరపోరాటాల, రక్త మాంస ఖండాల దృశ్యీకరణ ఎలా వుందని చూస్తే…
కథ
నల్గురు అనాధ పిల్లలు తిండికి లేక స్ట్రగుల్ చేస్తూంటారు. వీళ్ళకి ఇంకో శిశువు దొరికితే తమ్ముడిగా పెంచుకుంటారు. ఇతనే రామా (రామ్ చరణ్) అనే అన్నలకి పెద్దన్న. ఇతనే కష్టపడి వాళ్ళని చదివిస్తాడు. పెళ్ళిళ్ళయి పిల్లా పాపలతో వుంటారు. పెద్దన్న భువన కుమార్ (ప్రశాంత్) ఐఏఎస్ ఆఫీసర్. రామానే పని చేసి చదివించాడు. వైజాగ్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రత్యేక అధికారిగా ఇతను వస్తాడు. పందెం పరశురాం (ముఖేష్ రిషి) అనే వాడి బావమరిది బల్లెంబలరాం ( హరీష్ ఉత్తమన్)అనే వాడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తూ అక్రమాలకి పాల్పడతాడు. దీన్ని ఎదుర్కొన్న భువన కుమార్ కి ఇబ్బందులొస్తాయి. రామా వచ్చేసి పందెం పరశురాంకి బుద్ధి చెప్తాడు. దీంతో పందెం పరశురాం పగబడతాడు.
ఇటు రామా పెద్ద వదిన (స్నేహ) రామా కి సీత (కైరా అద్వానీ) తో సంబంధం కుదుర్చుతుంది. అటు బీహార్ లో రాజాభాయ్ (వివేక్ ఒబెరాయ్) అనే వాడు రామా కొడితే కోమాలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు లేచి కూర్చుంటాడు. ఇటు పందెం పరాశురాం ఎన్కౌంటర్ స్పెషలిస్టు (సాక్షి రామ్) తో, రామా అన్నల కుటుంబాల మీద దాడి చేయిస్తాడు. దీన్ని రామా ఎదుర్కొంటాడు. ఇంతలో రామా కోసం బీహార్ ముఖ్యమంత్రి (మాహేశ్ మంజ్రేకర్) సైన్యంతో వచ్చేస్తాడు. ఎందుకు వచ్చాడు? రాజాభాయ్ తో రామాకున్న సమస్యేమిటి? వినయ విధేయ రామాగా అన్నల ఉమ్మడి కుటుంబాన్ని రామా ఎలా కాపాడేడు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది పాతచింతకాయ పచ్చడి కథ. ఎక్కడా లాజిక్ కూడా లేని, తలాతోకా లేని కథ. ఇలాటి కథలతో ‘బి’ గ్రేడ్ సినిమాలు కూడా రావడం లేదనేది ఒక వాస్తవం. ‘ఏ’ గ్రేడ్ సినిమా ఇంకా ఇలా తీశారంటే, క్రేజీ కాంబినేషన్లకి ప్రేక్షకులు పడిపోతారనే. దర్శకుడు బోయపాటి యాక్షన్ టెంప్లెట్ ఇక ఖాళీ అయినట్టే. ‘జయజానకీ నాయక’ పతన స్థాయికంటే మించి ఇది దిగజారిన టాలెంట్. విషయం లేకపోవడంతో ఈసారి మైండ్ లెస్ యాక్షన్ ని నమ్ముకున్నారు. విషయం లేని మైండ్ లెస్ యాక్షన్ విషపూరితమే అయింది. జ్యూనియర్ స్టార్ సినిమా అంటే సీనియర్ స్టార్లు ఎప్పుడో వాడేసిన కథలే. వాటినే పట్టుకుని వేలాడినంత కాలం ఇలా కొత్త సీసాలో పాత సారా వ్యవహారం తప్పదు ప్రేక్షకులకి.
ఎవరెలా చేశారు
విషయముంటే ఏంత యాక్షన్ సీన్లు చేసినా చెల్లుతుంది రాంచరణ్ కి. విషయం లేనప్పుడు తన స్టార్ డమ్ తో ఏం చేసీ నిలబెట్టలేడు తను. ఒక రెండు సీన్లు మాత్రం బాగా నిలబెట్టాడు అంతే. మళ్ళీ షరా మామూలే విషయం లేని పాత రొటీన్ సీన్లేతో. ముఖేష్ రిషికి సారీ చెప్పే సీను, హేమ కూతురి పాత్ర హీరోయిన్ తో పెళ్ళిచూపుల సీను – ఈ రెండు సీన్లలో జెన్యూన్ కామెడీతో తెర చించేశాడు. చించి పోగులెట్టాడు ఫస్టాఫ్ లో. ఇదే స్పిరిట్ ని పాత్రకి మెయింటెయిన్ చేసి కొనసాగి వుంటే- ‘సింబా’ లో రణవీర్ సింగ్ లా మెరిసేవాడు. స్టార్ లక్షణం బీభత్సంగా రక్తపాతాలు సృష్టించడమే అన్నట్టుగా – బాడీ బిల్డింగ్ చేసుకుని, లేని కథ కోసం రకరకాల ఆయుధాలతో కెమెరా ముందు వీరంగం వేయడమేమిటి?
ఇక ఇతర నటీనటుల మాటేమోగానీ, హేమకి ఎన్నడూ లేనంత తెరని చించేసే పాత్ర దొరికింది. ఇలాటి పాత్రలు బాక్సాఫీసు అప్పీల్ కి పెట్టుబడులు. చివరిదాకా కొనసాగించినప్పుడే సినిమాకి మేలు జరుగుతుంది. ఆమె భర్త పాత్రలో పృథ్వీకూడా. ఇక ముఖేష్ రిషి, సాక్షి రామ్ లాంటి విలన్లు ఫస్టాఫ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. సెకండాఫ్ కథ కోసం బీహార్ సీఎం రాం చరణ్ ని వెతుక్కుంటూ రావడమేమిటో, రెండో కృష్ణుడిగా సెకండాఫ్ విలన్ వివేక్ ఒబెరాయ్ గొడవేంటో, నటనేంటో అర్ధం జేసుకోవాలంలంటే చాలా కష్టం. హీరోయిన్ కైరా అద్వానీని అర్ధం జేసుకోవడం ఇంకా కష్టం.
దేవీశ్రీ ప్రసాద్ ఇంకెలా మ్యూజిక్ కొట్టాలా అని విశ్వ ప్రయత్నం చేస్తే రెండు పాటలు దక్కాయి. ఏక్ బార్ అనే ఒక పాట, తస్సాదియ్యా అనే ఇంకో పాట. పైన చెప్పుకున్న రాం చరణ్ చించేసిన రెండు సీన్లకి, ఈ రెండు పాటలు కూడా కలుపుకుంటే – మొత్తం ఈ నాలుగే సినిమాలో చూడదగ్గవి. రూరల్ మాస్ ప్రేక్షకులకి మొత్తం చూడదగ్గవే కావచ్చును. కెమెరా వర్క్ క్వాలిటీ బావుంది. యాక్షన్ కొరియోగ్రఫీకి చాలా సార్లు ప్రేక్షకులు నవ్వారు. ఓపెనింగ్ లో చిన్నప్పుడు రామా అన్నలని కాపాడే సీన్లో, అంత చిన్న పిల్లాడికి ఆ అతి చూసి సామాన్య ప్రేక్షకులు కూడా నవ్వారు. దర్శకుడు ఇది తన మార్కు ఎమోషనల్ సీను అనుకున్నాడు. కానీ ప్రేక్షకులు కామెడీగా తీసుకున్నారు.
చివరికేమిటి
నవతరం స్టార్ గా రాం చరణ్ ఇలాటి సినిమా నటించడం చాలా విచిత్రమైన విషయం. ఇందులో తన పాత్రతో తను నటించిన కథేమిటో కూడా కనీస ఆలోచనలేకుండా చేసినట్టుంది. దర్శకుడు యాక్షన్ అద్భుతాలు వర్ణిస్తే కథయిపోతుందా? పాత్రయి పోతుందా? సెకండాఫ్ ని పూర్తిగా భరించలేని రక్తపాతాలతో నింపెయ్యడం సినిమా అవుతుందా? యువ ప్రేక్షకులేమనుకుంటున్నారో తెల్లారినప్పట్నుంచీ ట్విట్టర్ లో మార్మోగుతూనే వుంది.
యూత్ కి ఈ పాత మూసా ఫార్ములా కథ ఏమాత్రం నచ్చలేదు. రొట్ట రొటీన్ అని తీసి పారేస్తున్నారు. మరెవరి కోసం ఈ సినిమా? ట్విట్టర్ ఉపయోగించలేని రూరల్ మాస్ ప్రేక్షకులకి పరిమితం చేశారా? అది సరిపోతుందా? ట్విట్టర్ ని మర్చి పోయి రాం చరణ్ ఇష్టానుసారం సీనియర్ స్టార్ల సినిమాలు రీసైక్లింగ్ చేస్తానంటే – ఈ పండగ రోజుల్లో బయట పడొచ్చు. మిగతా రోజుల్లో ట్వీట్లకి నిలబడవు ఇలాటి ప్రయత్నాలు.
నటీనటులు: రామ్‌చరణ్, కియారా అడ్వాణీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్ ఉత్తమన్, మహేష్ మంజ్రేకర్, మధునందన్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్ ఎ.విల్సన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల 11-01-2019