ఓవైపు కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ చేయాలా వద్దా? అనే సందిగ్ధత నెలకొంది. టాలీవుడ్ షూటింగుల పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి. అల్లు అర్జున్ – సుకుమార్ జోడీ సర్వం సిద్ధం చేసుకుని థాయ్ ల్యాండ్ అడవుల్లో షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈలోగానే కరోనా మహమ్మారీ తరుముకు రావడంతో షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.
ఆ క్రమంలోనే సుకుమార్ ఏఏ 20 టైటిల్ ని ప్రకటించి బన్ని లుక్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు. ఖాళీ సమయంలో బన్ని లుక్ ని డిజైన్ చేసాడు. రంగస్థలంలో చరణ్ ని చిట్టిబాబుగా చూపించిన సుకుమార్ ఈసారి బన్నీని కూడా అంతే కొత్తగా చూపించబోతున్నాడని అభిమానుల్లో చర్చ సాగింది. పుష్ప టైటిల్ జస్ట్ ఓకే అనిపించినా.. బన్ని లుక్ మాత్రం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
40 రోజుల లాక్ డౌన్ తర్వాతా ఇంకా సెట్స్ కెళ్లే సీన్ అయితే కనిపించలేదు. ఆ క్రమంలోనే బన్ని అభిమానులు ఒకటే ఎగ్జయిట్ అయిపోతున్నారు. అంతేకాదు.. తాజాగా పుష్ప కొత్త పోస్టర్ ఇదేనంటూ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు. ఈ పోస్టర్ చూడగానే ఇది అధికారికంగా రిలీజైనదా? అన్న సందేహం కలగక మానదు. ఇందులో బన్ని లుక్ అదిరిపోయింది. పోలీసుల్ని కొట్టేసి జీప్ లో వేసి తాపీగా ఆ జీప్ పైనే కూచుని చుట్ట తాగుతున్న ఈ పోస్టర్ కిరాక్ పుట్టించేస్తోంది. ఇది మార్ఫింగ్ అండ్ ఎడిటింగ్ నైపుణ్యానికి సంబంధించినది. కానీ పోస్టర్ మాత్రం వైరల్ గా దూసుకెళ్లిపోతోంది. కేవలం బన్ని ఫేస్ ని మాత్రం మార్ఫ్ చేసి పాత పోస్టర్ ని చక్కగా యుటిలైజ్ చేశాడు అభిమాని అని అర్థమవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా కాబట్టి ఇలాంటి ఒక సీన్ తప్పనిసరిగా సినిమాలో ఉంటుందని అర్థమవుతోంది. బన్ని ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా.. నటిస్తూనే వేరొక గెటప్ లోనూ దర్శనమీయనున్నాడన్న సమాచారం ఉంది.