పూరి జగన్నాద్ మాట ఓ తూట. అది ఆయన సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది. చదువురాని వాడికి, అంత తెలివి లేని వాడికి కూడా సింపుల్‌గా అర్థమయ్యేట్టు డైలాగ్స్ రాయడం, వారిలో ఆలోచనలు రేకెత్తించేలా రాయడం పూరి ప్రత్యేకత. అయితే ఈ మధ్య పూరి పాడ్ కాస్ట్ అనే కొత్త మీడియం ద్వారా తన భావాలను అందరితో పంచుకుంటున్నాడు. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చెప్పిన మాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
‘కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం.. మనది కర్మభూమి అని చెప్పుకుంటాం కానీ కామన్ సెన్స్ ఉండదు. మనది వేద భూమి అంటాం కానీ వేదాలు ఎక్కడుంటాయో కూడా తెలీదు. పుణ్యభూమి అని చెప్పుకుంటాం కానీ లెక్కలేనన్ని పాపాలు చేస్తాం. మన తల్లి భారతమాత.. కానీ గంటకో రేపు చేస్తుంటాం. మనది సువిశాల భారతఖండం అంటాం కానీ పాపులేషన్‌తో కిటకిటలాడి చస్తాం. గంగా యమునా గోదావరి ఉన్నాయి కానీ ఆ నీళ్ల కోసం కొట్టుకుని చస్తాం. ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయ్.. ఆ గుళ్ల బయటే చెప్పులు దొంగిలిస్తుంటాం.. మహా కవులు పుట్టిన దేశం మనది కానీ 65శాతం నిరక్షరాస్యత..
పెట్రోల్‌లో కిరోసిన్ కలిపేస్తాం.. పాలల్లో నీళ్లు కలిపేస్తాం.. మున్సిపాల్టీ నీళ్లను కూడా కలుషితం చేస్తాం.. రేషన్ బయట అమ్మేస్తాం.. ఓట్లు అమ్ముకుంటాం.. టికెట్ లేకుండా ప్రయణాలు చేస్తాం.. పక్క భూములను కబ్జా చేస్తాం. ఇలాంటి ఎదవ పనులెన్నో చేశాం. అయితే ఈ ఫ్రీడం వల్ల మనం కొన్ని నేర్చుకున్నాం.. పెంటతీసి నెత్తికి రాసుకోవడం.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం.. పుల్లపెట్టి పక్కోన్ని గెలకడం.. వంటివి మాత్రం బాగా నేర్చుకున్నాం. పైన చెప్పిన వెదవ పనులెన్నో మనం చేశాం.
ఇప్పుడు ఓ పేపర్ తీసుకోండి.. ఇప్పటి వరకు చేసిన వెదవ పనులన్నీ రాసుకోండి.. ఎవ్వరికీ చూపించకండి… భవిష్యత్తులో చేయకుండా చూసుకోండి. 200 పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం ఇది. మనది మనమే మారాలి.. ఏ రాజకీయ నాయకుడు మనల్ని మార్చలేరు. కనీసం ఆ గోడ మీద ఉచ్చ పోయకపోయినా సరే అది కూడా దేశభక్తే.. జనగణమన’ అంటూ పూరి అందరిలోనూ ఎన్నో ఆలోచనలు కలిగించేలా చేశాడు. అయితే ఈ డైలాగ్స్ పూరి జనగణమన స్క్రిప్ట్‌లోవి అయి ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.