నిర్మాత కొడుకు డెబ్యూ..`పెళ్లి సెంటిమెంటు` కలిసొస్తుందా?
వారస హీరోలు(నెప్టోయిజం) రాజ్యమేలే చోట .. కొత్త కుర్రాళ్లు హీరోగా ఆరంగేట్రం చేయాలంటే చాలానే మ్యాటర్ ఉండాలి. హీరోగా అన్ని రకాలుగా శిక్షణ ఉండాలి. పైగా తెరపై చూశాక.. పనికొస్తాడు అని జనాలు నిర్ణయించాలి. నటించిన మొదటి సినిమా హిట్టయ్యి తీరాలి. కంటెంట్ పరంగానూ చాలా మ్యాటర్ కనిపించాలి. ఒక సినిమా హిట్టయినా ఆ తర్వాత నిలబెట్టుకునేందుకు చాలానే చేయాలి. డబ్బు దస్కం ఉన్నా .. వీటన్నిటితో పాటే లక్ కూడా కలిసి రావాలి. అందుకే ఎవరైనా కొత్త కుర్రాడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు అంటే ఆ టెన్షన్ కచ్ఛితంగా పేరెంట్ కి ఉంటుంది.
ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాత రాజ్ కందుకూరి అలాంటి టెన్షన్ లోనే ఉన్నారు. ఎన్నారై నిర్మాతగా ఎన్నో చిన్న సినిమాల్ని నిర్మించారు. `పెళ్లి చూపులు` లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించి ప్రశంసలు దక్కించుకున్నారు. పెళ్లి చూపులు చిత్రానికి జాతీయ అవార్డులు దక్కాయి. అందుకే ఇప్పుడు తనయుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు అంటే ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజ్ కందుకూరి వారసుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా `చూసి చూడంగానే`. శేష సింధూరావు దర్శకత్వం వహిస్తుండగా, తెలుగమ్మాయి వర్ష బొల్లమ్మ ఇదే సినిమాతో థానాయికగా పరిచయం అవుతోంది. ప్రేమమ్ ఫేం గోపి సుందర్ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ కి వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌లో శివ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజైంది. చేతిలో కెమెరా పట్టుకుని స్మార్ట్ ఫోటోగ్రాఫర్ గా కనిపిస్తున్నాడు. అయితే నటుడిగా ఏమేరకు రాణిస్తాడు? అన్నది తెరపై చూసి నిర్ణయించాల్సిందే. విజయ్ దేవరకొండ స్టార్ కావడానికి ఉపయోగపడే పెళ్లి చూపులు తీసింది రాజ్ కందుకూరి. మరి కొడుకు డెబ్యూని ఎంత ఘనంగా ప్లాన్ చేశారు? అన్నది చూడాలి. పెళ్లి చూపులు చిత్రం రిలీజ్ కి సహకరించిన పరిశ్రమ అగ్ర నిర్మాత .. తన స్నేహితుడు డి.సురేష్ బాబు శివ డెబ్యూకి అన్నివిధాలా సాయం చేస్తుండడం పెద్ద ప్లస్ కానుంది. `పెళ్లి చూపులు` సెంటిమెంటుతో పెళ్లి నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న సినిమాతోనే కొడుకుని కందుకూరి పరిచయం చేస్తుండడం ఆసక్తికరం.