సినీ పరిశ్రమల్లో విషాదాలు అభిమానుల్లో నిరంతరం చర్చకొస్తున్నాయి. తాజాగా ఒకరికి గుండె పోటు .. ఇంకొకరు కరోనాతో మృతి చెందడం హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ సూరీ కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. అధిక జ్వరంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన నిర్మాత అనిల్ సూరి మృతి చెందారు.
అయితే ముంబై లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి సిబ్బంది ఆయనను అడ్మిట్ చేసుకోలేదని అందువల్లనే మరణించాడని సోదరుడు ఆరోపించారు. అటుపై లీలావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించాడు. కరోనా వల్లనే జ్వరం వచ్చిందని పరీక్షల్లో తేలింది. బాలీవుడ్ లో రాజ్ కుమార్-రేఖ తో కలిసి కర్మయోగి, రాజ్ తిలక్ వంటి చిత్రాల్ని నిర్మించారు.
అలాగే గులాబీ (కృష్ణవంశీ) సంగీత దర్శకుడు శశిప్రీతమ్ కి గుండె ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. శశి ప్రీతమ్ గుండె వాల్వులు మూసుకుపోవడంతో వైద్యులు వెంటనే ఆయనకు స్టంట్స్ వేసి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో కోలుకుంటున్నారు. జేడీ చక్రవర్తి – మహేశ్వరి జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత శశి ప్రీతమ్ పలు విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఆయన హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. థమన్, చక్రి, అనూప్ వంటి శిష్యులు ఆయనకు ఉన్నారు.