ప్రకాశ్‌రాజ్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తున్నారో చెప్పేసారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ తాను పోటీచేసే స్థానంను ప్రకటించారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నట్లు శనివారం ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఈ వార్తను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.

తన కొత్త ప్రయాణానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. త్వరలోనే అన్ని వివరాలను మీడియాకు వెల్లడించనున్నట్టు ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.

‘సిటిజన్‌ వాయిస్‌’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక దృక్పథాన్ని చాటుతున్న ప్రకాశ్‌రాజ్‌ తన ఆప్తులతో పోటీ విషయంపై చర్చలు జరిపారు. కర్ణాటకతో పాటు తెలంగాణ, తమిళనాడులోని పలు గ్రామాలను దత్తత తీసుకున్న ఈ బహుభాషా నటుడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తారనే దానిపై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ ప్రకటనతో తెరపడింది.

ప్రకాష్ రాజ్‌ గత ఏడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య తర్వాత తన గళానికి పదను పెట్టారు. సోషల్ మీడియాల్లో బీజేపీ నిను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ ద్వారా ప్రశ్నిస్తూ తన పోరాటాన్ని కొనసాగించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల సందర్భంలో గుజరాత్‌ దళిత నాయకుడు జిగ్నేశ్‌తో కలిసి బీజేపి కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.