సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కల్చర్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. అభిమానులు సెలబ్రిటీలపై పెచ్చు మీరి కామెంట్లు చేయడం చూస్తున్నదే. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు సైబర్ క్రైమ్ కేసుల వరకూ వెళ్లడం చూశాం. నిన్నటిరోజున ఉన్నట్టుండి సడెన్ గా తన ఇన్ స్టా ఖాతాను హ్యాక్ చేశారని పూజా హెగ్డే తన అభిమానులకు వెల్లడించింది. ఆ ఖాతాను అనుసరించవద్దని.. అందులో వ్యాఖ్యలకు స్పందించ వద్దని కోరింది. అయితే అప్పటికే జరగాల్సినది జరిగిపోయింది.
ప్రస్తుతం టెక్నీషియన్స్ బృందం ఆ సమస్యను సాల్వ్ చేశారట. అయితే తన ఇన్ స్టా ఖాతాను హ్యాక్ చేయడానికి ముందు పూజా.. సాటి కథానాయిక సమంతపై అవమానకర వ్యాఖ్యను చేసిందని అభిమానులు సీరియస్ అవుతుండడం ప్రస్తుతం చర్చకు వచ్చింది. దీనిపై #PoojaMustApologizeSamantha అంటూ ట్విట్టర్ లో తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. కొలీగ్ సమంతా రూత్ ప్రభు గురించి అవాస్తవమైన మీమ్స్ పంచుకున్నందుకే ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారట. తమ అభిమాన తారపై కామెంట్ చేసినందుకు అభిమానులు కోపంగా ఉన్నారట.
వాస్తవానికి పూజా హెగ్డే ట్వీట్లలో సమంతా గురించి ప్రస్తావనే లేదు. సోషల్ మీడియాల్లో షికారు చేస్తున్న స్క్రీన్ షాట్లను పరిశీలిస్తే.. పూజా ఖాతాలో సమంత పోస్ట్ ఒకటి కనిపించింది. టీవీలో మజిలీ సినిమా చూస్తూ సమంత ఏమంత అందంగా లేదంటూ పూజా ఇన్ స్టాలో కామెంట్ చేసిందని ఫ్యాన్స్ ఆరోపణ. ఇది సమంత అభిమానులకు ఆగ్రహం కలిగించింది. అందుకు పూజా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అయితే పూజా అభిమానులు మాత్రం అసలు ఇందులో క్షమాపణ చెప్పడానికి ఏమీ లేదని కొట్టి పారేస్తున్నారు.
పూజా ఇదివరకెన్నడూ ఇలా చేయనేలేదు. ఏ ప్రముఖుడి పైనా సహోద్యోగిపైనా ఇంత బహిరంగంగా.. అర్థంపర్థం లేకుండా నోరు పారేసుకోలేదు. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి ఇలా కామెంట్ పెట్టారని సమంతకు పూజా వివరణ ఇచ్చింది. పూజా హెగ్డే ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తోంది. ఆమె తదుపరి చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` (అఖిల్- పూజా) రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే ప్రభాస్ సరసన `ఓ డియర్` అనే చిత్రంలో నటిస్తోంది. మోహెంజో దారో – హౌస్‌ఫుల్ 4 వంటి హిందీ చిత్రాలలో కూడా నటించింది.