పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు రాజకీయాల్ని సైతం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. పార్ట్ టైమ్ జాబ్ లా రాజకీయాల్ని మ్యానేజ్ చేస్తూ ఇటు వరుసగా సినిమాలతో బిజీ అయ్యారు. రీమేక్ చిత్రం వకీల్ సాబ్, క్రిష్‌తో మరో చిత్రం, హరీష్ శంకర్‌తో మరో చిత్రం పని చేయడానికి ఆయన అంగీకరించారు. అయితే ఊహించని పిడుగులా మీద పడింది కరోనా.
దీంతో ప్లానింగ్ అంతా అప్ సెట్ అయ్యింది. ఏ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ఈ సినిమాలు పూర్తవుతాయో ఎవరికీ సరైన క్లారిటీ లేదు. ఈ పరిస్థితులలో క్రిష్ చిత్రంపై క్లారిటీ మిస్సయ్యిందట. భారీ పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న పీరియడ్ చిత్రమిది. అందువల్ల నత్తనడకన పనులు సాగుతున్నాయిట. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ రెండు షేడ్స్‌లో కనిపించనున్నారు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో.. అలాగే మంచివాడిగానూ కనిపిస్తాడట.
సాధారణంగా దర్శకులు ఈ తరహా చిత్రాలకు గ్రాఫిక్స్ పై ఆధారపడతారు. కానీ క్రిష్ కొన్ని అరుదైన లొకేషన్లను ఎంపిక చేసి శాతకర్ణి తరహాలో బడ్జెట్ ని జాగ్రత్తగా అదుపులో ఉంచుకుని చిత్రీకరించాలని భావించాడు. కానీ కరోనా కారణంగా హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు పవన్ సుముఖంగా లేరట. విదేశీ షూటింగులకు ఆయన నో చెప్పేస్తున్నారట. దీంతో ప్లానింగ్ మొత్తం ఛేంజ్ అవుతోందని తెలస్తోంది.
మహానాయకుడు లాంటి భారీ ఫ్లాప్ తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పవన్ తో సినిమా చేస్తున్నాడు క్రిష్. ఎట్టిపరిస్థితిలో కంబ్యాక్ అవ్వాలన్న పంతంతో ఉన్నాడు. రాజమౌలి, త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్ ప్రస్తుతం టాప్ లీగ్ డైరెక్టర్స్ గా ఉంటే వీళ్ల జాబితాలో చేరాలన్న పంతం అతడిలో కనిపిస్తోంది. అయితే పవన్ తో ఆఫర్ ని ఏమాత్రం మిస్ చేసుకున్నా అతడికి వేరొక ఛాన్స్ కష్టమే. అందుకే ఇప్పుడు అన్నిటికీ రాజీకొచ్చి చిత్రీకరణలో మార్పు చేర్పులు చేసుకుంటున్నాడట. తాజా సన్నివేశంలో క్రిష్-పవన్ చిత్రం కనీసం 2021 లో అయినా వస్తుందా? అంటే సందేహమేనని అంటున్నారు.