ఆయన స్పూర్తితో పవన్ మళ్లీ సినిమాల్లోకి ..: పరుచూరి
మంచి ఫామ్ లో ఉండగా సినిమాలు కాదనుకుని పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేసాడు జనసేనాని పవన్ కళ్యాణ్. కోట్లకు కోట్లు అడ్వాన్స్ లతో నిర్మాతలు వెండబడుతున్నా కూడా ఆయన మాత్రం జనమే కావాలంటున్నాడు. ఇకపై తన పూర్తి జీవితాన్ని రాజకీయాల్లోనే ప్రజాసేవకే అంకింతం చేయాలని ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకున్నాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలని కేటాయించారని ఇకపై సినిమాలకి సమయం ఉండదని చెప్పారు. అయితే ఆయన మళ్లీ సినిమాల్లోకి రావాలని అభిమానులే కాదు …సినిమావాళ్లు సైతం కోరుకుంటున్నారు. తాజాగా పరుచూరి గోపాల కృష్ణ కూడా అదే మాట అన్నారు.
తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. “పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలు వచ్చేవరకూ మేకప్ కి దూరంగా ఉండొద్దు. ఒక వైపున రాజకీయ కార్యకలాపాలు చక్కబెడుతూనే మరో వైపున సినిమాలు చేయాలి. పవన్ తను చెప్పదలచుకున్నది సినిమాల ద్వారా చెప్పవచ్చు .. ప్రభావితం చేయవచ్చు.
ఈ విషయంలో ఆయన ఎమ్జీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎమ్జీఆర్ ఒక వైపున రాజకీయ కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తూనే మరో వైపున సినిమాలు చేస్తూ వెళ్లారు. ఒక సాధారణ వ్యక్తి ఇంటింటికీ తిరిగి చెప్పే ఒక మాటను .. ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో చెబితే సరిపోతుంది. ఆరిస్ట్ చేసుకున్న అదృష్టం అది. అందువలన పవన్ ఈ ఐదేళ్లలో సామాజిక సమస్యలపై స్పందించే కథాంశాలను ఎంచుకుని, ప్రజలను ఉత్తేజపరుస్తూ వెళితే బాగుంటుందని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.