బిగ్ బాస్-3 రచ్చ: నాగ్ ఇల్లు ముట్టడించిన ఓయూ జేఏసీ!
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్-3 నిరసనల సెగ మొత్తానికి అటు తిరిగి, ఇటు తిరిగి అక్కినేని నాగార్జునకు కూడా తగిలింది. తెలుగు బిగ్ బాస్-3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటిని ఈరోజు ఉస్మానియా జేఏసీ ముట్టడించింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు బిగ్ బాస్-3 కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు ఈ కార్యక్రమం హోస్ట్ గా నాగార్జున తప్పుకోవాలని నినాదాలు ఇచ్చారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో నాగార్జున ఇంటి వద్ద మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విషయమై నాగ్ ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు. మీడియాతో ఆయన ఈ రోజు మాట్లాడే అవకాసం ఉందని తెలుస్తోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు తమను లైంగికంగా వేధించారంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకుంది. ఈ విషయమై తెలంగాణ మానవహక్కుల కమిషన్ కు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది.
స్త్రీ, పురుషులను ఒకే ఇంట్లో 100 రోజులు బంధించి, కెమెరాలతో చిత్రీకరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికింది. ఈ షోను అడ్డం పెట్టుకుని మహిళలను లైంగికంగా దోచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదుతో జేఏసీ పేర్కొంది. రేపటి నుంచి బిగ్ బాస్-3 షో ప్రారంభం కానుంది.