మరీ ఒక్కడా…రామ్ చరణ్‌కు ఘోర అవమానమే

సంక్రాంతి కానుకగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచుకుంది. ఈ చిత్రం మొదట్లో కలెక్షన్స్ బాగున్నాయనిపించినా రాను రాను పూర్తిగా డ్రాప్ అయ్యాయి. అమెరికాలో వినయ విధేయ రామ బాక్సాఫీస్ పరిస్దితి మరీ దారుణంగా ఉంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..శనివారం రోజున దారుణమైన పరిస్థితి ఎదురైంది. థియేటర్‌లో ఒకే ఒక ప్రేక్షకుడు ఉండగా సినిమా నడిపించారట. దాంతో కేవలం 13 డాలర్లు మాత్రమే వసూలయ్యాయని ఓ పాపులర్ వెబ్‌సైట్ కథనాన్ని వెలువరించింది. మెగా హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి అంటున్నారు.

మాస్ సినిమాలను ఎన్నారైలు పెద్దగా చూడరు. ప్రయోగాత్మక, కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. దీంతో ఫుల్ మాస్ సినిమా అయిన వినయ విధేయ రామకు.. పెద్దగా కలెక్షన్లు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రంగస్థలం తర్వాత విడుదలయిన సినిమా అవడంతో ‘వినయ విధేయ రామ’ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే అమెరికాలో విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లే చేశారు. పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలకు సిద్ధం చేసినప్పటికీ ‘వినయ విధేయ రామ’ ప్రీమియర్లకు ఆశించిన రీతిలో బుకింగ్స్ రాలేదు.

రంగస్థలం కలెక్షన్లను ఈ సినిమా దాటేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు వేసుకున్న అంచనా పూర్తిగా తలకిందులయింది. మొత్తం 139 స్క్రీన్లలో 1,81,118 డాలర్ల మొత్తాన్ని ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా కలెక్ట్ చేసిందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం రంగస్థలం ప్రీమియర్ కలెక్షన్ల కంటే చాలా తక్కువ. అక్కడ నుంచే ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ ప్రారంభమైంది.

అలాగే మొదటి వీకెండ్‌లో (శుక్ర, శని, ఆదివారాల్లో..) ఈ సినిమా కేవలం 2లక్షల 41వేల 721 డాలర్లను మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే దాదాపు ఒక కోటీ 71 లక్షల రూపాయలన్నమాట. అంతకుముందు వచ్చిన రంగస్థలం.. ఓవర్సీస్‌లో రికార్డులు సృష్టించినా.. వినయ విధేయ రామకు మాత్రం ఓవర్సీస్‌లో నష్టాలే మిగిలాయని తెలుస్తోంది.