యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ ని నిలువనీయడం లేదు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రీకరణలో ఉన్న ప్రశాంత్ నీల్ తదుపరి ప్రాజెక్టుపైనా సీరియస్ గానే కసరత్తు చేస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది.
ఇటీవల తారక్ తో ప్రశాంత్ నీల్ భేటీ పూర్తయింది. ఆ క్రమంలోనే ప్రశాంత్ నీల్ మైండ్ లో ఉన్న టైటిల్ కూడా తాజాగా లీకవ్వడం ఉత్కంఠను పెంచుతోంది. తాజాగా ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకల్లో “రేడియేషన్ సూట్‌లో కలుద్దాం“ అంటూ హింట్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ టైటిల్ వైరల్ గా మారింది.
అసలు ఆ టైటిల్ దేనికోసం అంటే.. ఎన్.టి.ఆర్ కి కథ వివరించేప్పుడు రేడియేషన్ అన్న టాపిక్ హైలైట్ గా నిలిచిందిట. అందుకే అదే టైటిల్ ని కన్ఫామ్ చేశాడని చెప్పుకుంటున్నారు. టైటిల్ ని బట్టి ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమా అని భావించవచ్చు. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా కాబట్టి తారక్ పాత్ర తీరుతెన్నుల్ని ఇది రివీల్ చేస్తోందని ఊహిస్తున్నారు. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు. అలాగే కేజీఎఫ్ 2 పూర్తయ్యేవరకూ ప్రశాంత్ నీల్ అందుబాటులోకి రాలేడు. కాబట్టి ఈ ప్రాజెక్టు 2022లోనే సాధ్యమవుతుందని భావిస్తున్నారు.