బోయపాటికు ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నుయ్యి

వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటం  హాయిగా వెళ్లిపోతున్న బోయపాటి కెరీర్  కు ఓ పెద్ద దెబ్బ. ఆ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఓ కొలిక్కి రావటం లేదని వినికిడి. ఇన్నాళ్లు ఆయన తమ బ్యానర్ లో సినిమా చేస్తే చాలు అని భావించి చుట్టూ తిరిగిన నిర్మాతలు సైతం ఆయన వెనక నెగిటివ్ గా మాట్టాడుతున్నారు. ఆయన వన్నీ అతి పురాతన కథలని, అనవసరంగా నిర్మాత చేత ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టిస్తాడని, హీరోని మంచి చేసుకుని నిర్మాతని ముంచేస్తాడని ఇలా రకరకాల రూమర్స్ ఆయన ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నాయి.

దానికి తోడు తనను నమ్మి వెంటనే సినిమా ఇచ్చే బాలయ్య సైతం బోయపాటిని ప్రక్కన పెట్టేయటం ఈ రూమర్స్ కు మరింత ఊతం ఇచ్చినట్లైంది. వినయ విధేయరామ తర్వాత అయినా బోయపాటి మారతాడేమో అనుకుంటే కొంచెం కూడా మారలేదని అంటున్నారు.

బాలయ్యతో కాదనుకున్నాక ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయతోనూ, అఖిల్ తోనూ ముందుకు వెళ్దామని బోయపాటి ప్రయత్నించాడట. వాళ్లు తిరస్కరించారని అంటున్నారు. అందుకు కారణం భారీ బడ్జెట్ అని, తాము ఓకే అన్నా , అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసే ఇన్వెస్టర్స్ ని వెతకటం పెద్ద సమస్య అని నో చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో బోయపాటి తనే సొంతంగా ఓ చిన్న సినిమా ప్లాన్ చేద్దామా అనుకుంటున్నారట. అయితే ఒక్కసారి చిన్న సినిమా చేసి హిట్ కొడితే మళ్లీ అలాంటి సినిమాలు చేయమని నిర్మాతలు వెంటబడతారని భయపడుతున్నారట బోయపాటి.