ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎన్ని రూల్స్ పెట్టుకున్నా వాటికి పరిష్కారం దొరకదు. అలాంటి వాటిల్లో ఒకటి టైటిల్స్ వివాదం. టైటిల్స్ ని రిజిస్ట్రేషన్ విధానం ఎంత పగడ్బందీగా పెట్టుకున్నా వివాదాలు తప్పటం లేదు.
గతంలో మహేష్ ,త్రివిక్రమ్ చిత్రం చేస్తూ ఖలేజా అనే టైటిల్ పెడితే… అది తమదే అంటూ మరో నిర్మాత ముందుకు వచ్చారు. ఆ సెటిల్మెంట్ అవకపోవటంతో ‘మహేష్ ఖలేజా’..టైటిల్ పెట్టి రిలీజ్ చేసారు. ఆ తర్వాత కత్తి అనే టైటిల్ తో ఓ సినిమా అనుకుంటే ఆ టైటిల్ వేరే వాళ్ల దగ్గర ఉందని.. ‘కళ్యాణ్ రామ్ కత్తి’ పెట్టారు. ఇప్పుడు నిఖిల్ తాజా చిత్రం ‘ముద్ర’కు అలాంటి సమస్యే వచ్చి పడింది.
నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిఖిల్ 16వ చిత్రానికి ‘ముద్ర’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ, చిత్రానికి
సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఆ మధ్యన విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా టైటిల్ తమదే నంటూ వేరే నిర్మాత సీన్ లోకి వచ్చారు. నిఖిల్ నిర్మాతలేమో ‘ముద్ర’ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించలేదట.
దాంతో వేరే నిర్మాతలు అదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో ఇప్పుడు చిక్కొచ్చింది. వారు నిఖిల్ సినిమా కోసం ఆ టైటిల్ ను ఇచ్చేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నిఖిల్ నిర్మాతలు వేరే టైటిల్ పెట్టుకోవాలా లేక అప్పట్లో మహేష్, కళ్యాణ్ రామ్ వెళ్లిన దారిలోనే వెళ్లి… నిఖిల్ ముద్ర అని రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారట.
గన్ను కంటే పెన్ను గొప్పది అనే కాన్సెఫ్ట్‌తో జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న సమస్యలను గుర్తించడంలో మీడియా ఎటువంటి పాత్ర వహిస్తుంది. జర్నలిస్ట్‌గా నిఖిల్ తన కర్తవ్యంని ఎలా నిర్వర్తించాడు అనేదే ఈ చిత్ర మెయిన్ కథాంశంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మూవీ డైనమిక్స్ మరియు ఔరా సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది.