క్షమాపణ చెప్తూ ప్రెస్ నోట్ వదిలిన నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కిన అర్జున్‌ సురవరం సినిమాకు కష్టాల పర్వంకు ముగింపు కనపడటం లేదు. కొద్ది రోజుల క్రితం టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యలు ఎదురైతే..వాటి నుంచి బయటపడి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఊహించనివిధంగా వాయిదా పడింది. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించి,అర్దాంతరంగా ఆపేసారు.

ట్రైలర్‌ రిలీజ్‌తో పాటు సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టుగా నిఖిల్ అఫీషియల్ గా ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించారు. హాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ రేపు భారీగా విడుదల కానుండటంతో ఆ సినిమా దాటిని తట్టుకోలేక ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు హీరో నిఖిల్. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ షేర్ చేశారు..

‘ఒక సంవత్సరం గ్యాప్.. మంచి సినిమాతో ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి కార్మిక దినోత్సవం రోజు మీ అందరి అభిమానం కోసం రావడానికి ఎదురుచూస్తున్న టైమ్‌లో అవేంజెర్స్ లాంటి ఎదురుదెబ్బ.. ఎలా ఐతే అవెంజర్స్ ధానోస్‌ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారో.. అర్జున్ సురవరం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడతాడు. ఇలాంటి ఒక పాయింట్ ఉన్న సినిమాని చూసి నచ్చి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు వాయిదా వేస్తున్నాం.

ఇది నాకు బాధాకరం అయినప్పటికీ డబ్బులు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. వారిచ్చే మరో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం మీలాగే నేను వేచిచూస్తున్నా. ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం.. ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను.. మీ నిఖిల్’అంటూ ట్వీట్ చేశారు నిఖిల్.

ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. మహర్షి రిలీజ్‌ తరువాత అర్జున్‌ సురవరం రిలీజ్‌ అవుతుందని తెలిపారు. నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు.