ఓసోసి మా సిట్టిబాబు
గోరు మీకెందుకు నచ్చరు బాబూ?
2018-19 సీజన్ జాతీయ అవార్డుల్ని కేంద్రం ప్రకటించింది. ఇందులో ఎన్నో గొప్ప గొప్ప అర్హమైన చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ వంటి నవతరం హీరోలు అవార్డులు కొల్లగొట్టారు. అంధాధున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, ఊరి చిత్రంలో విక్కీ కౌశల్ అద్భుత నట ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అందుకే జూరీ ఆ ఇద్దరినీ సముచితంగా గౌరవించింది. ఇక జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కి అవార్డు దక్కుతుందన్నది ముందే ఊహించనదే కానీ.. ఒకే ఒక్కరి విషయంలో మాత్రం ఏదో తేడా కొట్టిందే అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈసారి తెలుగు సినిమా ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకోవడం గ్రేట్. అందులోనూ మూడు అవార్డుల్ని `మహానటి` కైవశం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కాస్ట్యూమ్స్ అవార్డులు మహానటికి దక్కాయి. అలాగే ప్రశాంత్ వర్మ అ! చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్, మేకప్ విభాగంలో అవార్డులు దక్కాయి.
రామ్ చరణ్- సుకుమార్ ల రంగస్థలం చిత్రం ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో (రాజా కృష్ణన్) పురస్కారం గెలుచుకుంది. సుశాంత్ – రాహుల్ కాంబినేషన్ మూవీ చి.ల.సౌ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును గెలుచుకుంది.
పురస్కారాలకు ఎంపిక చేసిన విధానం బావుంది. అయితే ఒకే ఒక్క విషయంలో మెగాభిమానుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన ఎందులో తీసిపోయింది? అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఆయుష్మాన్.. విక్కీ కౌశల్ లాంటి నటులు గొప్పగా నటించినా రామ్ చరణ్ నటించలేదా? కేవలం ఉత్తరాది స్టార్లపైనే జూరీ దృష్టి సారించి చిట్టిబాబును లైట్ తీస్కుందా? అన్న సందేహాలు కలిగాయి. గోదారి యాస ఆహార్యాన్ని అద్భుతంగా పలికించిన చిట్టిబాబు నటన జూరీకి నచ్చలేదా? చెవులు వినిపించని వాడిగా.. అన్న(ఆది పినిశెట్టి) గారి కోసం.. ప్రియురాలి (సమంత) కోసం ప్రాణం పెట్టేవాడిగా అతడి నటన అస్సలు నచ్చనే లేదా? ఒక ప్రాంతీయ భాషా నటుడు `ఉత్తమ నటుడు` అయితే జాతీయ భాషా నటులకు ఈగో హర్టవ్వదా? అందుకే ఇలా చేశారా? గోదారి ప్రాంత సంస్కృతిని మహదాద్భుతంగా తెరపై చూపించిన సుకుమార్ పనితనం కూడా కనిపించలేదా? ఇలా ఎన్నో సందేహాలు అయితే ఉన్నాయి. అయితే అంత పెద్ద వేదికపై ఎన్నో సినిమాల్ని వడకట్టి అవార్డులు ఇస్తారు కాబట్టి జూరీని పూర్తిగా తప్పు పట్టలేమా? అయినా ప్రేక్షకులు ఇచ్చే మెచ్చుకోలు పురస్కారాల ముందు ఈ అవార్డులేమంత గొప్ప? అంటారా..!