నారా వారబ్బాయి నారా రోహిత్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఆరంభం ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని చక్కని సెన్సిబిలిటీస్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆశించిన బ్లాక్ బస్టర్లు లేకపోవడం వరుసగా ఫ్లాపుల్ని ఎదుర్కోవాల్సి రావడం రోహిత్ కి పెద్ద ఇబ్బందిగా మారింది. డిఫరెంట్ జానర్ స్క్రిప్ట్ లు ఎంచుకుంటూ ముందుకెళ్లినా రోహిత్ ఎందుకనో సక్సెస్ కాలేకపోయాడు. మంచి హైట్..రంగు..చూడటానికి హీరోయిక్ లుక్ ఉంటుంది. కానీ టైమ్ బ్యాడ్ అయితే ఏం చేయగలరు ఎవరైనా! ఎంత ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా `వీర భోగ వసంత రాయలు` సినిమా చేసాడు. ఆ తర్వాత కనిపించలేదు. అవకాశాలొచ్చినా సినిమాలు చేయలేదు. అయితే ఇంత గ్యాప్ తర్వాత ఇటీవలే రోహిత్ ఇచ్చిన సర్ ప్రైజ్ మామూలుగా లేదు. పూర్తి మేకోవర్ తో ఓ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు.
దీంతో యంగ్ హీరో లుక్ ఛేంజ్ పై ఆసక్తికర చర్చ సాగింది. అభిమానులు ఎగ్జయిట్ అయ్యారు. వావ్ అన్నా…చాలా బాగున్నారు..నైస్ లుక్!! అంటూ కొంత మంది నెటిజనులు కామెంట్లు పెట్టారు. తాజాగా నారా వారబ్బాయి అజ్ఞాతవాసం ఎందుకు? అన్నది తనే స్వయంగా లీక్ చేసాడు. కొంత కాలంగా తన లుక్ తనకే నచ్చలేదుట. అందువల్లే ఏడాదిన్నరగా ఎవరికీ కనిపించలేదని అన్నాడు. ఈ గ్యాప్ లో కఠోరంగా శ్రమించి శరీరానికి ఓ లుక్ తెచ్చానని తెలిపాడు. అందుకే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నా కష్టానికి ఫలితం దక్కింది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే రెండు సినిమా ల్ని ప్రారంభిస్తాను. అయితే ఈ లాక్ డౌన్ వల్ల మాత్రం తనకు నష్టం జరిగిందని అన్నాడు.
ఇన్నాళ్లు జిమ్ములో గడిపిన రోహిత్ లాక్ డౌన్ తో ఇంట్లో గడపాల్సి వస్తోందని..వర్కౌట్లు అన్ని ఇంట్లోనే ఉన్న వస్తువులతో చేయాల్సి వస్తోందని తెలిపాడు. అలాగే మంచి డైట్ ఫాలో చేస్తున్నా. లాక్ డౌన్ పూర్తయ్యే లోపూ మరింత ఫిట్ గా, సన్నగా అవుతాననని ధీమాను వ్యక్తం చేసాడు. మరి హీరోగారు సిక్స్ ప్యాక్ లాంటింది ట్రై చేసాడా? అన్న విషయం మాత్రం దాచి పెట్టాడు. అయినా లాక్ డౌన్ కేవలం నారా వారికేనా.. అందరికీ చిక్కులు తెచ్చిందిగా! లాక్ డౌన్ తో లుక్ మారిపోద్దని భయపడొద్దు.. ఇంట్లో అయినా హార్డ్ వర్క్ చేయాల్సిందే ఎవరైనా.