ఆ రెండు టీవీ చానెళ్ల‌పై మెగా నిర్మాత ఫైరింగ్

టాలీవుడ్‌పై టీవీ చానెళ్ల క‌క్ష‌పూరిత ధోర‌ణి ఎందుకు?

24/7 న్యూస్ చానెళ్లు వ‌చ్చాక టాలీవుడ్ కి క‌లిసొచ్చిందా? లేక తీర‌ని న‌ష్టం జ‌రుగుతోందా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. అయిన‌దానికి కానిదానికి టీఆర్పీ గేమ్ ఆడుతున్న మీడియా ద్వంద్వ వైఖ‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మీడియా విలువల్ని చాలావ‌ర‌కూ దిగ‌జార్చింది ఎల‌క్ట్రానిక్ మీడియానే అన్న విమ‌ర్శ అన్ని సంద‌ర్భాల్లో వినిపిస్తూనే ఉంది. కొన్ని టీవీ చానెళ్లు అయితే ప‌నిగ‌ట్టుకుని క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంపైనా నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఈ ముప్పు టాలీవుడ్ కి సంక‌టంగా మారింద‌న్న వాద‌న తెలుగు సినిమా నిర్మాత‌ల్లో వినిపిస్తోంది.

అంద‌రికీ మీడియా అవ‌స‌రం. అయితే కొన్ని మీడియాలు క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని కె.ఎస్.రామారావు లాంటి సీనియ‌ర్ నిర్మాత‌ ప‌బ్లిక్ వేదిక‌పైనే వాపోయారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న నిర్మించిన `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` చిత్రానికి లైవ్ ఇస్తామ‌ని చెప్పిన ఓ రెండు అగ్ర‌ టీవీ చానెళ్లు క‌వ‌రేజీనే ఇవ్వ‌లేదని వాపోయారు. నేను నిర్మాత‌ను కానా? చిన్న సినిమా అస‌లు సినిమానే కాదా? అంటూ ఆయ‌న ఓ రేంజులోనే స‌ద‌రు చానెళ్ల‌పైనా విరుచుకుప‌డ్డారు. రేటింగ్ ఉన్న టీవీ ఛానెల్స్ స్టార్ల వెంటే ప‌డ‌తాయి. చిన్న సినిమా, పెద్ద‌ సినిమా అని భూతద్దం పెట్టీ మ‌రి కొన్ని ఛాన‌ల్స్ ప‌నిగా ప్ర‌చారం చేస్తుంటాయి. రిలీజ్ కు ముందు టీవీ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తే ఒక‌లా ఇవ్వ‌క‌పోతే మ‌రోలా ప్ర‌చారం చేయ‌డం ప‌రిపాటి అయింద‌ని విమ‌ర్శించారు.

హైద‌రాబాద్ జేఆర్సీ సెంట‌ర్‌లో జ‌రిగిన ప్రీరిలీజ్ ని స‌ద‌రు చానెళ్లు లైవ్ చేయ‌క‌పోవ‌డంపై నిర్మాత లో అస‌హ‌నం బ‌య‌ట‌ప‌డింది. “ఎల్.ఎల్.పీ. ద్వారా ఆ రెండింటినీ మేం ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. లైవ్ కోసం కెమెరాలు పెట్టారు. మేం ఫంక్షన్ పూర్తి చేసుకొని ఇంటికి వెళితే.. టీవీలో లైవ్ రాలేదేంటని ఇంట్లోవాళ్లు అడిగారు. నేను షాక‌య్యాను. చాలా సిగ్గుచేటుగా ఫీలయ్యాను“ అంటూ ఆవేద‌న చెంద‌డం మీడియా వ‌ర్గాల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లోనూ పెద్ద ఎత్తున‌ చ‌ర్చ‌కొచ్చింది. “ఆ రెండు చానల్స్‌ని నిర్మాతల తరపునా, ఇండస్ట్రీ తరపునా చాలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. పెద్ద సినిమాలకు వాళ్లేం చెయ్యక్కర్లేదు. చేస్తే అది వాళ్లకు ఉపయోగం. చిన్న సినిమాల్ని బతికించడం కోసం వాటిని ఎంకరేజ్ చేస్తే.. అది వాళ్లకీ గర్వకారణంగా ఉంటుంది. దయచేసి ఆ చానళ్లు ఎలాంటి పక్షపాతం లేకుండా, వ్యాపార దృష్టి లేకుండా మంచి సినిమాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కోరుతున్నా. లైవ్ ఆ రెండు చానళ్లకే ఎందుకిస్తున్నామో ఇప్పుడు నాకర్థం కాలేదు. అయినా మా ద‌గ్గ‌ర డ‌బ్బులు ఎందుకు తీసుకున్న‌ట్లు? లైవ్ ఎందుకు వేయ‌లేదు. నాట‌కాలు ఆడుతున్నారా? నాలాంటి నిర్మాత‌నే ముంచేస్తున్నారు. చిన్న నిర్మాత‌ల ప‌రిస్థితి ఇంకెత దారుణంగా ఉంటుందో అర్ధ‌మ‌వుతోంది“ అంటూ ఆ రెండు చానెళ్ల‌పై స‌ద‌రు నిర్మాత‌ నిప్పులు చెరిగారు. మెగాస్టార చిరంజీవి క‌థానాయ‌కుడిగా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు నిర్మించిన కె.ఎస్.రామారావు అంత‌టి వారికే ఇలా జరిగిందని అనుకుంటే పొర‌పాటే. ఎంద‌రో ఔత్సాహిక నిర్మాత‌లు.. చిన్న నిర్మాత‌లు రెగ్యుల‌ర్ గా వాపోయేది ఇదే. క‌డుపు చించుకుంటే కాలిపై ప‌డుతుంద‌ని అంటారు! మీడియా నీతిమాలిన ప‌నిని ప్ర‌శ్నిస్తే తిరిగి అది త‌మ‌పై నెగెటివ్ ప్ర‌చారానికి తావిస్తుందేమోన‌ని భ‌య‌ప‌డి చాలామంది నిర్మాత‌లు మూసుకుని ఉండిపోవ‌డంపై రెగ్యుల‌ర్ గా చ‌ర్చ సాగుతూనే ఉంటుంది.