మ‌న్మ‌ధుడు కాపీ క‌థేనా? కింగ్ ఆన్స‌ర్ ఇదీ!

`మ‌న్మ‌ధుడు 2` అస‌లు గుట్టు లీక్

ఇటీవ‌ల టాలీవుడ్ లో కాపీ క్యాట్ వివాదాల గురించి తెలిసిందే. సినిమా రిలీజ్ స‌మ‌యంలో క‌థ కాపీ కొట్టారంటూ ఏదో ఒక వివాదం తెర‌పైకి వ‌స్తూనే ఉంది. కింగ్ నాగార్జున న‌టిస్తున్న `మ‌న్మ‌ధుడు2` సినిమాపైనా కాపీ క‌థ అనే ఆరోప‌ణ వ‌చ్చింది. ఈ సినిమాని ఫ‌లానా హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టార‌ని కొంద‌రు లేదు ఇదో రీమేక్ సినిమా అని మ‌రికొంద‌రు సామాజిక మాధ్య‌మాల్లో వాద‌న‌లు వినిపించారు. అయితే ఇదంతా హీరో కం నిర్మాత నాగార్జున చెవిన ప‌డింద‌ట‌.

దీంతో అన‌వ‌స‌రం రాద్ధాంతానికి చెక్ పెట్టేందుకు నాగార్జున సూటిగా మ్యాట‌ర్ లోకి వ‌చ్చేశారు. నిన్న‌టిరోజున హైద‌రాబాద్ లో జ‌రిగిన మ‌న్మ‌ధుడు ట్రైల‌ర్ ఈవెంట్ లో మ‌న్మ‌ధుడు క‌థకు స్ఫూర్తి ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అన్న‌దానికి ఆయ‌న ఎలాంటి త‌డ‌బాటు లేకుండా సూటిగా ఆన్స‌ర్ ఇచ్చారు. నాగార్జున మాట్లాడుతూ- “ఊపిరి చిత్రాన్ని ఇదివ‌ర‌కూ `అన్‌టచ్‌బుల్స్‌` అనే సినిమా రైట్స్‌ కొనుక్కుని రీమేక్‌ చేశాం. అలాగే `మ‌న్మ‌ధుడు` విషయానికి వస్తే.. కేవా మూవీస్‌ గీత ఏడాదిన్నర క్రితం ఓ ఫ్రెంచ్‌ మూవీను తీసుకొచ్చి మీరు చేస్తే బావుంటుందని చెప్పారు. ఆ సినిమా నేను చూశాను. బాగా నచ్చడంతో హక్కులను కొని స్క్రిప్టుపై ఏడాది పాటు ప‌ని చేశాం. ఆ సినిమా నుంచి కేవ‌లం థీమ్ మాత్ర‌మే తీసుకుని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు బోలెడ‌న్ని మార్పులు చేర్పులు చేశాం. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది“ అని అన్నారు.

క‌థల్ని కాపీ కొట్టే సంస్కృతి త‌న‌కు లేద‌ని నాగార్జున తెలిపారు. క్రియేటివిటీని కొట్టేయ‌లేమ‌ని సూటిగానే చెప్పారు. ఫ్రెంచ్ స్క్రిప్టు న‌చ్చాక‌… 2 నెలల పాటు సంప్ర‌దింపులు చేశామ‌ని.. రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాతే `మ‌న్మ‌ధుడు 2` కథా చర్చలు ప్రారంభించామ‌ని ఈ ప్రాసెస్ లో రాహుల్ ర‌వీంద్ర‌న్ ఉన్నార‌ని కూడా నాగార్జున చెప్పారు. మన్మథుడు సీక్వెల్ క‌థ కానే కాదు ఇది. ఆ క్యారెక్టర్స్‌కు.. కథకు ఎక్కడా సంబంధం లేద‌ని జోనర్‌ మాత్రం రొమాంటిక్‌ కామెడీ అని తెలిపారు. ఆగ‌స్టు 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది.