సూప‌ర్‌స్టార్ వ‌స్త్ర వ్యాపారం, మ‌హేష్ పేరుతో కొత్త బ్రాండ్!

మ‌హేష్ పేరుతో కొత్త బ్రాండ్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ అనే నేను- మ‌హ‌ర్షి చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని త‌దుప‌రి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంపై దృష్టి సారించారు. ఎట్టి ప‌రిస్థితిలో హ్యాట్రిక్ కొట్టాల‌న్న పంతంతో పని చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో మూడు భారీ సెట్లు వేసి వాటిలో ప్ర‌ధాన తారాగ‌ణంపై చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు.

ఓవైపు షూటింగుల‌తో బిజీగా ఉంటూనే మ‌హేష్ మ‌రో విష‌యంపైనా సీరియ‌స్ గా దృష్టి సారిస్తున్నార‌ట‌. అందుకు భార్య న‌మ్ర‌త ప్లానింగ్ పెద్ద సాయం అవుతోంద‌ట‌. మ‌హేష్ కాల్షీట్లు స‌హా అత‌డు చేసే ప్ర‌తి ప‌నిలోనూ న‌మ్ర‌త‌కు భాగ‌స్వామ్యం ఉంటుంది. త‌న ప్లానింగ్ తోనే ఇంత పెద్ద స‌క్సెస్ సాధించారు. ఇటీవ‌లే ఏషియ‌న్ సినిమాస్ భాగ‌స్వామ్యంతో ఏఎంబీ సినిమాస్ ప్రారంభంలోనూ న‌మ్ర‌త‌దే మెజారిటీ ప్లానింగ్. హైద‌రాబాద్-గ‌చ్చిబౌళిలో ప్రారంభించిన‌ ఏఎంబీ మాల్ పెద్ద స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. మ‌ల్టీప్లెక్స్ చైన్ వ్యాపారం ఇరు తెలుగు రాష్ట్రాలు స‌హా మెట్రో న‌గ‌రాల‌కు విస్త‌రించే యోచ‌న‌లో మ‌హేష్ -న‌మ్ర‌త ఉన్నారు.

దీంతో పాటే రిటైల్ వ‌స్త్ర శ్రేణి వ్యాపారంలోనూ ప్ర‌వేశించ‌నున్నార‌ట‌. అందుకోసం స్పాయిల్ అనే ఓ ప్ర‌ముఖ బ్రాండ్ ని సొంతంగా చేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా మ‌హేష్ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌క‌పోయినా.. దీనిని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసే ఆలోచ‌న‌లోనూ ఉన్నార‌ట‌. ఇ-కామ‌ర్స్ రంగం పెద్ద స్థాయిలో విస్త‌రిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇది ప్రాథ‌మిక స్థాయిలోనే ఉంది కాబ‌ట్టి ఇందులో స‌క్సెస్ ద‌క్కుతుంద‌ని విశ్లేషించి ఈ రంగంలో ప్ర‌వేశిస్తున్నార‌ట‌. మ‌హేష్ పేరుతో ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసి మార్కెట్లో క్రేజు తెచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే వ‌స్త్ర శ్రేణి వ్యాపారం అన‌గానే ఇప్ప‌టికే ఈ రంగంలో రౌడీ పేరుతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాపుల‌ర‌య్యాడు. ఓ రిటైల్ వ‌స్త్ర శ్రేణి సంస్థ‌తో ఒప్పందం చేసుకుని దేవ‌ర‌కొండ దూసుకుపోతున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ స్టార్లు సైతం ఈ రంగంలో ప్ర‌వేశించి భారీ ఆదాయ ఆర్జ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌స్త్ర శ్రేణి వ్యాపారంలో సోన‌మ్- దీపిక‌- అనుష్క శ‌ర్మ వంటి వాళ్లు పాపుల‌ర్.