మహేష్ మాటతో..ఫ్యాన్స్ ప్రమోషన్ మొదలు

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటించిన మల్టీస్టారర్‌ ‘f2’. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. శనివారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ అందుకుంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రాన్ని మహేష్ చూసి ట్వీట్ చేసారు. ‘f2’ సినిమాను చాలా ఎంజాయ్‌ చేశానని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. వెంకీ టైమింగ్ ఫన్నీగా ఉందని అన్నారు.

‘‘‘f2’ సినిమా చూశా. పూర్తి వినోదాత్మక చిత్రం. చాలా ఎంజాయ్‌ చేశా.. వెంకీ సర్‌ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు, అది చాలా ఫన్నీగా అనిపిస్తుంది.. బ్రిలియంట్‌. వరుణ్‌తేజ్‌ పాత్ర కూడా సరదాగా ఉంటుంది. వెంకీ సర్‌ టైమింగ్‌కు వరుణ్ సరిగ్గా‌ సరిపోయారు’ అని మహేష్ పోస్ట్‌ చేశారు. దాంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయటం మొదలెట్టారు.

మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌, నవీన్ చంద్ర, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.