‘యాత్ర’ రిలీజ్ ఆపమంటూ కోర్టులో కేసు, వేసిందెవరంటే..

దివంగ‌త ముఖ్య మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం యాత్ర. ఈ చిత్రం ఈనెల 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే సెన్సార్ పూర్త‌ైన ఈ చిత్రం… అన్ని ర‌కాల క్లియ‌రెన్స్ వ‌చ్చినా.. రిలీజ్ ని ఆపాల్సిందేనంటూ మ‌ద్రాస్ హైకోర్టులో కేసు వేసారు. వారం ముందు ఈ వివాదం తో సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు ఏర్ప‌డ‌నున్నాయో అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇండస్ట్రీలో సాగుతోంది.

శ్రీ సాయి లక్ష్మీ పిక్చర్స్ చెన్నై కు చెందిన ఎమ్ మురగన్ ఈ సినిమాపై ఓ సివిల్ సూట్ వేసారు. ఈ చిత్రం టైటిల్, కథని తాము రిజిస్టర్ చేసామని , ఆ హక్కులు తమకే చెందుతాయని కోర్టులో వేసారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ సౌతిండియా లో రిజస్టర్ చేసామని చెప్పారు.

ఈ కేసు విష‌య‌మై విచార‌ణ చేప‌ట్టిన మ‌ద్రాసు హైకోర్టు విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 6 నాటికి వాయిదా వేసింది. ఆరోజు తుది విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే రిలీజ్ కి స‌రిగ్గా రెండ్రోజుల ముందు ఈ విచార‌ణ జ‌రుగుతుండ‌డంతో యాత్ర టీమ్ లో కొంత‌మేర ఇబ్బందికర వాతావ‌ర‌ణం అలుముకుంది.  

నిర్మాత మాట్లాడుతూ..”బయోపిక్‌లకు చాలా అర్థాలు ఉన్నాయి. చిన్నతనం నుంచి చనిపోయేవరకూ ఓ వ్యక్తి గురించి చెప్పడం ఒక రకం. జీవితంలో కొన్ని సంఘటనల్ని తీసుకుని చెప్పడం మరొకటి. ఇండియాలో అలాంటివి పెద్దగా లేవు. కానీ హాలీవుడ్‌లో ఇలాంటివే తీస్తారు. ‘డార్క్‌స్టార్‌’, ‘కింగ్‌స్పీచ్‌’ వంటి సినిమాలు అటువంటివే. ఆ వ్యక్తుల జీవితంలో బాగా ప్రభావితం చేసిన సంఘటనలు, వాళ్ల వల్ల జనాల్ని ప్రభావితం చేసిన వాటితోనే సినిమాలు వస్తాయి. అలాంటిదే ‘యాత్ర’ అనే సినిమా. కేవలం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భాన్ని తీసుకుని అన్ని కమర్షియల్‌ అంశాలు జోడించి వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమిది” అని చిత్ర నిర్మాత విజరు చల్లా చెప్పారు.

విజరు చల్లా కంటిన్యూ చేస్తూ.. ‘ఆనందోబ్రహ్మ’ పోస్ట్‌ప్రొడక్షన్‌లో భాగంగా చెన్నై వెళుతుండగా దర్శకుడు మహి చెప్పిన కథ ఇది. ఇలాంటి టైంలో రాజకీయ చిత్రం ఎందుకు? అని వద్దన్నాను. ఆ తర్వాత రైతుల గురించి ఒక్క సీన్‌ చెప్పాడు. అది బాగా కనెక్ట్‌ అయింది. కథంతా ఇలా ఉంటే చేద్దామన్నాను. అలా కార్యరూపం దాల్చింది. ఈ కథ అనుకున్నప్పుడే మమ్ముట్టి మెదిలారు. కెమెరామెన్‌ శ్యామ్‌దత్‌ ద్వారా మమ్ముట్టిని సంప్రదించాం.

ఆయన తెలుగుపై ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే.. దర్శకుడ్ని కథంతా తెలుగులోనే చెప్పమన్నారు. మధ్యమధ్యలో ఇంగ్లీషులో చెబుతుంటే కట్‌చేసి.. తెలుగులోనే చెప్పాలని పట్టుపట్టారు. అలా పూర్తిగా కథను తెలుగులోనే పదిగంటలు విని ఓకే చేశారు. సెట్‌లో కూడా సీన్‌, డైలాగ్స్‌ ముందుగానే విని ట్రాన్స్‌లేటర్‌ ద్వారా మలయాళంలో చదువుకుని అర్థం చేసుకుని నటించారు. అందుకే అద్భుతంగా ఆయన పాత్ర వచ్చింది. ఈ సినిమా గురించి జగన్‌ విని ఎటువంటి మార్పులు చేయకపోవడమే కాకుండా ఉన్నది ఉన్నట్లు తీయమని మాత్రమే చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఈ చిత్రాన్ని తీయలేదు. ఎప్పుడో అనుకున్నది ఇప్పటికి కుదిరింద’ని తెలిపారు.