దర్శకుడు శ్రీనువైట్ల-రైటర్ కొన వెంకట్ జోడీ సూపర్ సక్సెస్ ల గురించి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన `ఢీ`..`రెడీ`.. `దూకుడు`..`బాద్ షా` బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఈ విజయాలతోనే శ్రీను హిట్లగా పాపులరయ్యాడు వైట్ల. ఆ క్రమంలోనే ఆ ఇద్దరి బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది. ఈ కలయికలో మరిన్ని సినిమాలు తెరకెక్కితే బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయని పరిశ్రమలో భారీ అంచనాలేర్పడ్డాయి. కానీ అనుకోకుండా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఒక్కసారిగా వివాదాలు రాజుకున్నాయి. నువ్వెంత? అంటే నువ్వెంత? అనుకునేంత సీన్ క్రియేట్ అయింది. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఊపిరి సలపనివ్వకపోవడమే ప్రధాన కారణం అన్న ప్రచారం సాగింది. కోపతాపాలు ఈగోలు స్నేహాల్లో చూసేవే అయినా ఆ ఇద్దరి మధ్యా అసలు రాజీ అన్నది కుదరలేదు. మెగాస్టార్ చిరంజీవి అంతటివాడే ఒక సినిమా కోసం ఆ ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేసి ఒక సినిమాకి పని చేయించారు. కానీ ఆ తర్వాత మాత్రం తిరిగి ఒకరి ముఖం ఒకరు చూడనే లేదు. ఈగోలు కోపాల గోల ఆగలేదు. అటుపై ఎవరి దారుల్లో వాళ్లు సినిమాలు చేసుకున్నారు.
అయితే ఈ క్రమంలో ఇద్దరూ ఫెయిలయ్యారు. కలిసుంటేనే కలదు సుఖం అన్న తీరుగా రాజీబేరం కుదరకపోవడంతో శ్రీనువైట్లను అది క్రైసిస్ లోకి నెట్టేసింది. కోన లాంటి స్టార్ రైటర్ అండ తనకు లేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. ఇక ఆ క్రైసిస్ వల్ల వరుస పరాజయాలు ఇబ్బందుల్లోకి నెట్టేసాయి. కోన కూడా రైటింగ్ పై పాక్షికంగానే దృష్టి పెట్టి… సినీ నిర్మాణంపై ఎక్కువగా ఆసక్తి చూపించారు. అయితే ఆ ఒక్క క్షణం ఆ ఇద్దరి మధ్యా పుల్లలు పెట్టిన రీజన్ ఏమిటి? అన్నది ఇప్పటికీ అభిమానులకు పూర్తి స్థాయిలో తెలీదు. ఏవో కోపతాపాలు ఈగోలు అడ్డొచ్చాయి .. క్రెడిట్ మ్యాటర్స్ అనుకున్నారే తప్ప ఇదీ డెప్త్ అని ఎవరికీ తెలీదు.
తాజాగా తమ మధ్య తగాదాకు అసలు కారణం ఇదీ!! అంటూ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత కోన వివరణ ఇచ్చాడు. వైట్ల పై తనకున్న కోపం అంతా కక్కేసి మళ్లీ అతనితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానంటూ వెల్లడించడం షాకిస్తోంది. ఇక కోన వెర్షన్ లోకి వెళ్తే … ఒక సంగీత దర్శకుడు పది ట్యూన్లు అందిస్తే డైరెక్టర్ అందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటాడు. రైటర్ పది వెర్షన్లు రాస్తే డైరెక్టర్ ఒకటి తీసుకుని బెటర్ మెంట్ చేయోచ్చు. కానీ క్రెడిట్ అంతా నాదే అంటే ఎలా? శ‌్రీనుతో అక్కడే సమస్య వచ్చిందని అన్నారు. అందుకే అతనికి దూరంగా ఉన్నానని తెలిపారు. అంతకు మించి తమ మధ్య ఎలాంటి పగ ప్రతీకారాలు లేవని.. కత్తులతో దాడులు చేసుకునేంత పగలేవీ లేవు అంటూ నవ్వేసారు. అన్నీ కుదిరితే మళ్లీ శ్రీను తో సినిమాలు చేయడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ వెల్లడించారు కోన. అయితే కొపాన్ని కక్కేసి మళ్లీ దరి చేరతానంటే ఎవరైనా చేరనిస్తారా? అన్నదే ఇక్కడ డౌట్.
పరిశ్రమలో ఇగోయిజం అలానే మిగిలి ఉంది. పొగ లేని నిప్పులాంటిది అది. ఇక్కడ చేతులు కట్టుకోవాలి…తలదించి.. నమస్కారం చేసే సంస్కారం మీదనే పరిశ్రమ నడుస్తుంటుంది. తలెత్తి నుదిటి భృకుటి ముడి వేస్తామంటే.. సూటిగా నిలదీస్తామంటే కుదరనే కుదరదు. మరి ఇలాంటి చోట పాత మిత్రులు కోన-వైట్ల మళ్లీ కలుస్తారా.. లేదా? అన్నది చెప్పలేం. ఇక ఏదైనా వైట్లపైనే ఆధారపడి ఉందని ఓ క్లారిటీ వచ్చేసినట్టే. ప్రస్తుతం శ్రీనువైట్ల కూడా అవకాశాలు కోసం వెయిట్ చేస్తున్నారు. సరైన ఛాన్స్ లేక ఆపసోపాలు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో కోనతో జాయిన్ అయితే కలిసొస్తుందనే విశ్లేషిస్తున్నారు. మరి వైట్ల దిగొస్తాడా?