మన్మధుడికి చిన్న సినిమాల స్ట్రోక్!
కింగ్ నాగార్జున నటించిన `మన్మధుడు 2` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. సినిమాపై నెగెటివ్ టాక్ ప్రభావం వసూళ్లలోనూ స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా హిట్టు అన్న టాక్ వినిపించి ఉంటే వేరేగా ఉండేదే. కానీ ఫ్లాప్ టాక్ తో సోమవారానికే చాలా చోట్ల థియేటర్లు ఖాళీ అయ్యే సన్నివేశం కనిపిస్తోందని ట్రేడ్ రిపోర్ట్ అందుతోంది. ఈ సినిమా దాదాపు 20కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే అంత పెద్ద మొత్తం షేర్ వసూలు చేయాల్సి ఉండగా.. తొలి వీకెండ్ నాటికి కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేయడం నిరాశ పరుస్తోంది. అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరుతుందనుకుంటే.. అక్కడి నుంచి ఈ సినిమా కేవలం 2లక్షల డాలర్లు మించి వసూలు చేయలేదు. నాగార్జున కెరీర్ లో ఓవర్సీస్ అంటే మనం, ఊపిరి లాంటి వన్ మిలియన్ డాలర్ క్లబ్ సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ ఆ స్థాయి రిజల్ట్ ని అందుకోవడంలో మన్మధుడు2 తడబడింది.
అయితే ఈ సినిమాతో పాటుగానే ఒకరోజు ఆలస్యంగా రిలీజైనా సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట
ఆశ్చర్యకరమైన రిజల్ట్ వైపు దూసుకెళుతోందని ట్రేడ్ చెబుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన అన్నిచోట్లా చక్కని వసూళ్లు సాధిస్తోంది. ఆన్ లైన్ లోనూ బుక్ మై షో చూస్తే … మన్మధుడు2 కి 51శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తే .. కొబ్బరి మట్టకు 83శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. కొబ్బరి మట్ట కేవలం రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 1.17కోట్ల షేర్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్ 1.33 కోట్ల షేర్ ని వసూలు చేసిందని రిపోర్ట్ అందింది. 2.2 కోట్ల మేర గ్రాస్ వసూలైందని తెలుస్తోంది. మొత్తానికి చిన్న సినిమా అయినా సంపూ నటించిన కొబ్బరి మట్టకే జనం పట్టంగట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే ఈ వారం రిలీజైన కురుక్షేత్ర
(దర్శన్) అనే భారీ డబ్బింగ్ చిత్రం అసలు విడుదలైనట్టే ఎవరికీ తెలియదు. ఆ సినిమాకి సరైన ప్రచారం లేకపోవడం కూడా పెద్ద మైనస్ గా మారింది. కార్తికేయ నటించిన గుణ, రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ఇంకా డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తున్నాయని రిపోర్ట్ ఉంది. మన్మధుడు2 ఫ్లాప్ టాక్ తో బెల్లంకొండ రాక్షసుడు
తిరిగి వసూళ్లను పెంచుకుంటోందట.