హీరో ఆది తాత ఎవరో తెలుసా?

(జయంతి చంద్రశేఖరరావు)

 

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి  ఎవరో తెలుసు కదా…

 ఆయన కీ౹౹ శే  పూడిపెద్ది జోగీశ్వర శర్మ.  ఆయన   పి.జె.శర్మ (మే 24, 1933 – డిసెంబర్ 14, 2014) గా ప్రసిద్ధలు.  పూడిపెద్ది జోగీశ్వర శర్మ ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. తెలుగు, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. 500 కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగా తన గాత్రం అందించారు. అతను, రాం రాబర్ట్ రహీం, కలెక్టర్ జానకి మొదలైనవి ఈయనకు గుర్తింపు తెచ్చినవి. వీరి కుమారుడు సాయికుమార్ ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు మరియు కథానాయకుడు. మరో ఇద్దరు కుమారులు రవిశంకర్, అయ్యప్ప శర్మ కూడా నటులు డబ్బింగ్ కళాకారులుగా కొనసాగుతున్నారు. మూడవ తరం వాడైన సాయికుమార్ కొడుకు ఆది కూడా కథానాయకుడిగా ఉన్నారు. బాలకృష్ణ నటించిన అధినాయకుడు ఆయనకు నటుడిగా చివరి చిత్రం.

Hero Saikumar


జననం


వీరు విజయనగరం జిల్లా కళ్ళేపల్లి గ్రామంలో మే 24, 1933 తేదీన జన్మించారు. చిన్నతనం నుండే నాటకరంగం పై మక్కువ పెంచుకొని పేదరైతు, అనార్కలి, పల్లెపడుచు, ఆశాలత, కులంలేని పిల్ల, ఋష్యశృంగ, నవప్రపంచం మొదలైన నాటకాలలో ప్రధాన పాత్రలను పోషించారు.

 

Aadi Saikumar

వీరు 1954లో మొదటిసారిగా అన్నదాత సినిమాలో చిన్న వేషంలో కనిపించారు. 1957లో విజయనగరం రాఘవ నాటక కళాపరిషత్ పోటీలలో పాల్గొని సినీ ప్రముఖుల ఆహ్వానం మీద మద్రాసు చేరుకున్నారు. ఆరుద్ర మరియు శ్రీశ్రీ ల ప్రోత్సాహంతో తొలిసారిగా ఉత్తమ ఇల్లాలు (1957) చిత్రంలో డబ్బింగ్ చెప్పారు. 1957 లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇల్లరికం ఆయనకు నటుడిగా మొదటి సినిమా. ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ కుమార్ ప్రేమనజీర్ ధరించిన ఎన్నో పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

ఒక వైపు డబ్బింగ్ కళాకారుడిగా పనిచేస్తూనే కొన్ని వందల చిత్రాలలో నటించారు. వీరు నటి కృష్ణజ్యోతిని 1960లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. పెద్దకొడుకు సాయికుమార్ ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు మరియు నటుడు, రెండవ కొడుకు రవిశంకర్ కూడా డబ్బింగ్ కళాకారుడే. మూడవ అబ్బాయి అయ్యప్ప పి. శర్మ సినీ దర్శకుడు. వీరి ఇద్దరు కుమార్తెలు కమల మరియు ప్రియ. వీరి మనవడు ఆది ప్రేమ కావాలి సినిమాతో హీరోగా తెలుగువారికి పరిచయమయ్యారు.

మరణం

ఈయన 2014, డిసెంబర్ 14 ఆదివారం నాడు హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.