కియరా కయ్యానికి దిగే వేళాయెనె
భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ముంబై బ్యూటీ కియరా అద్వాణీ. సీఎం భరత్ ని ప్రేమించు వసుమతిగా మహేష్ అభిమానుల గుండెల్ని చిద్రం చేసింది. ఆ తర్వాత వినయ విధేయ రామా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ ఇటువైపు చూడనే లేదు. అయినా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
అటు హిందీ పరిశ్రమలో ఎం.ఎస్.ధోని, కబీర్ సింగ్, గుడ్ న్యూజ్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది. కియరా ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర కథానాయిక. క్షణం తీరిక లేనంత బిజీ. అక్కడ సక్సెస్ నిచ్చెనను నెమ్మదిగా స్థిరంగా అధిరోహిస్తోంది. ప్రస్తుతం తన ఖాతాలో చాలా గొప్ప ప్రాజెక్టులు ఉన్నాయి.
ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ వరసగా ఏడెనిమిది చిత్రాల్లో నటించేసింది.తాజాగా ఆమె లక్ష్మీ బాంబ్, షేర్షా, భూల్ భూలైయా 2 చిత్రాల్లో నటిస్తోంది. నేడు కియరా 28 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఫుల్ గా చిలౌట్ చేసింది. కియరాకు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి బర్త్ డే విషెస్ అందాయి. కియరా తన తల్లిదండ్రులు జగదీప్, జెనీవీవ్ అద్వానీలతో కలిసి తన సోదరుడు మిషాల్ అద్వానీతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ ఈసారి కుటుంబంతో మాత్రమేనని తెలిపింది.
ఇక ఈ నాలుగైదేళ్ల కెరీర్ లోనే కియరా ఒక్కో సినిమాకి రూ.2 కోట్ల మినిమం పారితోషికం అందుకుంటూ 25-30 కోట్లు ఆర్జించిందట. బ్రాండ్ వ్యాల్యూ పలకడంతో ప్రకటనల రూపంలోనూ భారీ మొత్తాల్ని కళ్ల జూసిందని తెలుస్తోంది.