`కేజీఎఫ్ 2` అధీరా లుక్ అదిరెనే

`కేజీఎఫ్ 2` అధీరా లుక్ అదిరెనే

రాక్ స్టార్ య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన `కేజీఎప్‌-1` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 250 కోట్ల వ‌సూళ్లు సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నంబ‌ర్ -1 చిత్రంగా రికార్డుల‌కెక్కింది. ప్ర‌స్తుతం దీనికి సీక్వెల్ ని తెర‌కెక్కించే ప‌నిలో ప్ర‌శాంత్ నీల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

పార్ట్ -1 స‌క్సెస్ నేప‌థ్యంలో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` కోసం చిత్ర‌యూనిట్ మ‌రింత హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో యాక్ష‌న్ కి స్కోప్ మ‌రింత ఎక్కువ అని తెలుస్తోంది. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా అరాచ‌కాల్ని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తున్నార‌ట‌. ఇక‌పోతే మొద‌టి భాగంలో అంత‌గా ప‌రిచ‌యం లేని ఫేస్ ల విల‌నీ చూడాల్సొచ్చింది. అందుకే ఈసారి ప్లాన్ మార్చి బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ ని విల‌న్ పాత్ర‌కు ఎంపిక చేసుకున్నారు. తాజాగా ద‌త్ `అధీరా` లుక్ ని కేజీఎఫ్ టీమ్ రిలీజ్ చేసింది. సంజూ భాయ్ రూపం.. క‌ణ‌క‌ణ మండే తీక్ష‌ణ‌మైన చూపులు .. పొడ‌వాటి శిరోజాల‌కు ముసుగు వేసిన తీరు చూస్తుంటే అత‌డి విల‌నీ ఏ రేంజులో పండబోతోందో అర్థ‌మ‌వుతోంది.

సంజ‌య్ ద‌త్ చేరిక‌ను ఇప్ప‌టివ‌ర‌కూ కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. నేడు బ‌ర్త్ డే సంద‌ర్భంగా సంజ‌య్ ద‌త్ కి గిఫ్ట్ గా ఈ లుక్ ని హోంబలే సంస్థ రివీల్ చేసింది. సంజూ భాయ్ రాక‌తో టీమ్ కి రెట్టింపు ఉత్సాహం వ‌చ్చింద‌న‌నే చెప్పొచ్చు. అత‌డి వ‌ల్ల బాలీవుడ్ లో మార్కెట్ ప‌రంగానూ క‌లిసి రానుంది. తొలి భాగానికి 100 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు చేశార‌ని ప్ర‌చార‌మైంది. ఈసారి అంత‌కుమించి పెడుతున్నార‌ట‌. రాక్ స్టార్ య‌శ్ ఈ సీక్వెల్లో మ‌రింత ర‌ఫ్ గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. అధీరాగా సంజ‌య్ ద‌త్ ఎలా న‌టించ‌నున్నారు? అన్న‌ది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.