ఇన్నాళ్లూ తమిళ సినిమాలు డబ్బింగ్ అయ్యి తెలుగులోకి రావటం చూసాం. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్’ కన్నడ సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ పెట్టుకుని స్ట్రైయిట్ సినిమాలా పబ్లిసిటీతో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే కన్నడ సినిమావాళ్ళు కూడా తెలుగుని ఖచ్చితంగా ఓ మార్గెట్ గా భావిస్తారనటంలో సందేహం లేదు.
కన్నడ నటుడు యశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కె.జి.ఎఫ్’. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు ప్రముఖ నటుడు విశాల్ విడుదల చేశారు. ట్విటర్ ట్రెండ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్ టాప్ స్థానంలో ఉంది.
‘విధి చేతివాటం. ఆ రోజు రాత్రి రెండు సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది. అతనూ పుట్టాడు’ అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా..’ అంటూ యశ్ చెప్పే డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఈ చిత్రంలో యశ్ ముంబయిలో పుట్టి చిన్నా చితకగా పనులు చేసుకుంటూ కోలార్ బంగారు మైన్లకు అధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన అనుభవాలు, సంఘటనలు ఏంటి? అనేదే సినిమా.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, జపనీస్, చైనీస్ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇన్ని భాషల్లో విడుదల అవుతున్న ఏకైక కన్నడ చిత్రమిదే కావడం విశేషం. దాంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మిల్సీబ్యూటీ తమన్న ఓ ప్రత్యేక పాటలో డాన్స్ చేసింది.
యాష్ , శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనంత్‌నాగ్, అచ్యుత్‌రావు, అయ్యప్ప .పి.శర్మ తదితరులు నటిస్తున్నారు. తమన్న ప్రత్యేక పాటలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: శ్రీకాంత్, సంగీతం:రవి భసూర్, పాటలు:రామజోగయ్య శాస్ట్రి, మాటలు:హనుమాన్ చౌదరి, ఆర్ట్:శివకుమార్, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, కొరియోగ్రఫీ:జానీ, ఫైట్ మాస్టర్:అన్ బరివు-విక్రమ్, సహ నిర్మాత:కైకాల రామారావు, నిర్మాత:విజయ్ కిరంగధూర్, సమర్పణ:కైకాల సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ప్రశాంత్ నీల్.